బాలీవుడ్ చిత్రాలు క్రమంగా భారతీయ సంస్కృతి మూలాలకు దూరం అవుతున్నాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ బాలీవుడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఇండియన్ సినిమా" అనే పదం తనకు పరాయిగా అనిపిస్తుందని, "భారతీయ చిత్ర పరిశ్రమ" అనే పదమే తనకు సముచితంగా అనిపిస్తుందని స్పష్టంగా తెలిపారు.
హిందీ సినిమాపై ఆ ప్రభావం
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,"ప్రతి చిత్ర పరిశ్రమకు తగిన ప్రత్యేకత ఉంది. కానీ నేను 'ఇండియన్ సినిమా' అనే పదాన్ని ఇష్టపడను. అది కొంతవరకు నాకు పరాయిగా అనిపించే ఫీలింగ్ ఇస్తుంది. నా దృష్టిలో ఇది భారతీయ చిత్ర పరిశ్రమ. మన సినిమా పరిశ్రమను ప్రారంభించినప్పుడు, అది మన సంస్కృతికి దగ్గరగా ఉండేది. కానీ తరువాతి తరాల దర్శకుల వల్ల ఇది మారింది. ముఖ్యంగా హిందీ సినిమా గ్లోబలైజేషన్ ప్రభావానికి లోనైంది" అని వ్యాఖ్యానించారు.
సంస్కృతికి సంబంధించిన పాత్రలని కామెడీగా చూపించారు
అంతేకాకుండా, కొన్ని హిందీ సినిమాలు మన సంస్కృతిని ప్రతిబింబించే పాత్రలను హాస్యాస్పదంగా చూపించాయని ఆరోపించారు. కాగా, దక్షిణాది సినిమాలు మాత్రం ప్రస్తుతం భారతీయ సంస్కృతిని బాగా ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఉదాహరణగా "దంగల్" చిత్రాన్ని పేర్కొన్నారు: "దంగల్ వంటి సినిమాలు భారతీయతను ప్రతిబింబించాయి. అలా మూలాలకు దగ్గరగా ఉండే సినిమాలు ఇప్పుడు అరుదుగా మారాయి" అన్నారు.
గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాలు తక్కువ
బాలీవుడ్ దర్శకులు కమర్షియల్ సినిమాల కోసం స్థానిక ప్రేక్షకులతో అనుబంధాన్ని కోల్పోయారని ఆయన అభిప్రాయపడ్డారు. "దక్షిణ భారతదేశంలో 70-80 శాతం మార్కెట్ గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుంది. అందుకే దక్షిణాది సినిమాల్లో గ్రామీణ నేపథ్యం సహజంగా ఉంటుంది. అందువల్లే దక్షిణాది చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
సౌత్ లో పల్లెటూరి నేపథ్యం ఉన్న చిత్రాలు, జానపద చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో ఇలాంటి చిత్రాలు తక్కువ. ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాల ఫెయిల్యూర్ కి ఇదే కారణం అని పవన్ తెలిపారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి రెండు పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వాటిలో మొదటిది ‘హర హర వీరమల్లు’, ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంతో సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 24న రిలీజ్ కానున్నట్లు రీసెంట్ గా చిత్ర యూనిట్ ప్రకటించింది. అనేక వాయిదాల తర్వాత చివరికి ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నాలుగేళ్లుగా ఈ చిత్రం మేకింగ్ దశలోనే ఉంది.
పవన్ నటించిన మరో యాక్షన్ డ్రామా ఓజి మూవీ. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో పవన్ కళ్యాణ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తమన్ సంగీతం అందించారు. ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఉంటూనే ఈ చిత్రాలని పూర్తి చేశారు. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు.
