మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?
దాదాపు పదేళ్లుగా గ్లోబల్ బాక్సాఫీస్‌ను అమీర్ ఖాన్ దంగల్ సినిమా ఏలుతోంది. అయితే, 2026-27 మధ్య రాబోతున్న మూడు భారీ ఇండియాన్ మూవీస్ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది.

దంగల్ అసాధారణ విజయం
ఇండియాతో పాటు చైనా, హాంగ్‌కాంగ్‌లో 'దంగల్' అసాధారణ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఒక్క చైనా మార్కెట్ నుంచే దాదాపు రూ.1305 కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్లు సుమారు రూ.2070 కోట్లకు చేరాయి. ఇండియాలో ఈ చిత్రం దాదాపు రూ.387 కోట్లు సంపాదించింది. 'బాహుబలి 2', 'పుష్ప 2' వంటి బ్లాక్బస్టర్లు ఈ రికార్డుకు దగ్గరగా వచ్చినా, దాన్ని దాటలేకపోయాయి. దీంతో దాదాపు తొమ్మిదేళ్లుగా 'దంగల్' రికార్డు పదిలంగా ఉంది.
వారణాసితో రెడీ అవుతున్న రాజమౌళి..
'బాహుబలి', 'RRR' వంటి గ్లోబల్ హిట్స్ ఇచ్చిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం 'వారణాసి' సినిమాపై పనిచేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 2027లో విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఈసినిమా టార్గెట్ 3000 కోట్ల వరకూ ఉండే అవకాశం కనిపిస్తోంది.
దీనితో పాటు ధురంధర్ 2 , రామాయణ్ కలిసి.. రాబోయే 16 నెలల్లో ఈ మూడు సినిమాల్లో ఏదో ఒకటి 'దంగల్' లైఫ్‌టైమ్ గ్లోబల్ వసూళ్లను దాటేయగలదని ట్రేడ్ అనలిస్ట్ వరుణ్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. ఇది భారత సినిమా బాక్సాఫీస్ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని లిఖించవచ్చు.
బాలీవుడ్ మూవీస్ సాధించగలవా?
ఆదిత్య ధర్ తీస్తున్న 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ నిపుణులు నమ్ముతున్నారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. రణ్వీర్ సింగ్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సీక్వెల్ మార్చి 2026లో విడుదల కానుంది.
మరోవైపు, నితేష్ తివారీ 'రామాయణ పార్ట్ వన్' పైనా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రణ్‌బీర్ కపూర్, సన్నీ డియోల్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న ఈ మైథలాజికల్ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027లో రానుంది.

