Telangana Rains : జులై ఫస్ట్ హాఫ్ లో ఇక వర్షాలు లేనట్లే.. మరి సెకండాఫ్ పరిస్ధితేంటి?
జులైలో మొదటి సగంలో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేవు… మరి సెకండాఫ్ లో వర్షాలు ఎలా ఉంటాయి? తెలుగు ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి
Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాకాలం మొదలైనప్పటి నుండి ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసింది లేదు... జూన్ మొత్తం లోటు వర్షపాతమే. జులై ఆరంభంలో కాస్త ఆశ కలిగిస్తూ కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురిశాయి... కానీ ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. వర్షాలు ముఖం చాటేయడంతో తెలుగు ప్రజలు మరీముఖ్యంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు జల్లులే...
అయితే ఇదే పరిస్థితి మరికొన్నిరోజులు ఉండే అవకాశాలున్నాయని... చెదురుమదురు జల్లులు మినహా విస్తారంగా వర్షాలుండవని వాతావరణ శాఖ చెబుతోంది. జులై సెకండాఫ్ లో కొన్నిరోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని... వచ్చే నెల ఆగస్ట్ లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలుంటాయని చెబుతోంది. అంటే వర్షాలకోసం తెలుగు రైతులు మరికొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే.
జులైలో తెలంగాణలో వర్షాల పరిస్థితి ఇదే..
జూన్ లో పరిస్థితే జులైలో ఉండేలా ఉందని వాతావరణ సూచనలను బట్టి తెలుస్తోంది. ఈ నెలలో భారీ వర్షాలుంటాయని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశ తప్పడంలేదు... ఆరంభంలో ఆశలు రేకెత్తిస్తూ కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసాయి... కానీ రానురాను పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుత ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతాచోట్ల వర్షాలు జాడేలేదు. కొన్ని జిల్లాల్లో అయితే ఎండలు కాస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
జులైలో ఫస్ట్ హాఫ్ లో ఇక వర్షాలు లేనట్లే....
జులై 11 నుండి 15 వరకు తెలంగాణలో పెద్దగా వర్షాలుండవని... ఎండలు, ఉక్కపోత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలుంటాయని తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు.
ఇక జులై 16 నుండి 20 వరకు ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం వంటివి ఏర్పడే అవకాశాలున్నాయని... వీటి ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందట. అయితే ఈ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఉండవని... కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయని తెలిపింది.
జులై సెకండాఫ్ లో వర్షాల జోరు..
జులై 20 తర్వాత తెలంగాణలో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ విభాగం ప్రకటించింది. తూర్పు, దక్షిణ, సెంట్రల్ తెలంగాణలో భారీ వర్షాలుంటాయని వెల్లడించింది. హైదరాబాద్ లో కూడా మంచి వర్షాలే కురుస్తాయట. ఇక ఆగస్ట్ లోనే వరదల స్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
నేడు తెలంగాణలో వర్షాల సంగతేంటి?
తెలంగాణలో ఇవాళ(శుక్రవారం) భారీ వర్షాలేమీ ఉండవని... కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని...ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని వెల్లడించింది.
ఇవాళ ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలుండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాబ గద్వాల, వనపర్తి, సిద్దిపేట, నారాయణపేట జిల్లాల్లో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భువనగిరిలో కూడా చిరు జల్లులకు అవకాశం ఉంది. ఇలా వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నేడు ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇవాళ (శుక్రవారం) పెద్దగా వర్షాలేమీ ఉండవని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని... మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘాలతో కమ్మేసి చల్లని వాతావరణం ఉంటుందితప్ప వర్షాలుండవని వెల్లడించింది. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.