Hair care: జుట్టుకు మెహందీ పెట్టుకునే ముందు ఇవి తెలుసుకుంటే మంచిది!
తెల్లజుట్టును కవర్ చేసుకోవడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలామంది మెహందీ వాడుతుంటారు. మెహందీలో ఉండే కొన్ని గుణాలు జుట్టుకు రంగునిస్తాయి. అలాగే వేసవిలో తల చల్లగా ఉండటానికి కూడా కొందరు మెహందీ వాడుతుంటారు. అయితే మెహందీ వాడేముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవెంటో ఇక్కడ చూద్దాం.

ప్రస్తుతం జుట్టుకు మెహందీ వాడటం సాధారణం అయిపోయింది. కానీ మెహందీని ఎక్కువగా వాడితే లేదా ఎక్కువసేపు తలపై ఉంచితే జుట్టుకి చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని మీకు తెలుసా? అవసరానికి మించి మెహందీని తలకి వాడితే.. అది జుట్టుకి మేలు చేసే బదులు హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మెహందీ వాడితే?
సాధారణంగా మెహందీ వాడిన వెంటనే జుట్టు మెత్తగా, మెరుస్తూ కనిపించినా తర్వాత జుట్టుని డ్రైగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మెహందీ ఎక్కువగా వాడటం వల్ల జుట్టు బలహీనంగా మారుతుందట. దీనివల్ల జుట్టు గరుకుగా, చిట్లిపోయే సమస్య వస్తుందట.
జుట్టు రాలడం పెరుగుతుంది!
అంతేకాకుండా జుట్టుకి ఎక్కువ మెహందీ వాడితే అది జుట్టు రాలడాన్ని పెంచుతుంది. జుట్టు డ్రై అవుతుంది. డ్రై జుట్టు త్వరగా రాలిపోతుంది. ముఖ్యంగా మెహందీతో వేరే ఏమీ కలపకుండా ఉంటే ఈ సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాంటివి వాడొద్దు!
మార్కెట్లో దొరికే కొన్ని రకాల మెహందీల్లో రసాయనాలు ఉండటం వల్ల అవి తలకు హాని కలిగిస్తాయి. దీనివల్ల తలలో దురద, మంట వస్తుంది. కాబట్టి కెమికల్స్ లేని మెహందీని వాడటం మంచిది.
ఎలా వాడాలి?
మెహందీని జుట్టుకి తరచుగా వాడకుండా నెలకోసారి వాడటం మంచిది. మెహందీని 40 నుంచి 50 నిమిషాలు ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మెహందీ పెట్టుకున్న తర్వాత హెయిర్ మాస్క్ వాడటం మర్చిపోవద్దు. అలాగే నూనె వాడండి. దీనివల్ల జుట్టు డ్రై కాదు.