- Home
- Entertainment
- కన్నప్ప ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. భక్తిని డామినేట్ చేసేలా యాక్షన్, ఆ పదాలని తొలగించిన సెన్సార్ బోర్డు
కన్నప్ప ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. భక్తిని డామినేట్ చేసేలా యాక్షన్, ఆ పదాలని తొలగించిన సెన్సార్ బోర్డు
కన్నప్ప చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి భారీగానే కత్తెర్లు పడ్డట్లు సమాచారం.

భారీ బడ్జెట్ లో కన్నప్ప
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో నటించిన భక్తిరస చిత్రం కన్నప్ప. మైథలాజి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మోహన్ బాబు భారీ బడ్జెట్ లో నిర్మించారు. ఈ చిత్ర బడ్జెట్ 140 కోట్లు అని సమాచారం. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రంలో నటించారు. ఇటీవల విడువులైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.
కన్నప్ప సెన్సార్ కంప్లీట్
భక్తి ప్రధానంగా సాగే చిత్రాలకు సాధారణంగా 'యు' సర్టిఫికేట్ లభిస్తుంది. అయితే విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప చిత్రానికి మాత్రం సెన్సార్ బోర్డు నుండి 'యూ/ఏ' సర్టిఫికెట్ లభించింది. అంతేకాదు, ఈ చిత్రానికి 13 కీలక సన్నివేశాల్లో మార్పులు, తొలింపులు చేయాలంటూ సెన్సార్ బోర్డు సూచించింది. ఈ చిత్రానికి భారీగానే సెన్సార్ నుంచి కత్తెర్లు పడ్డాయి.
సెన్సార్ తొలగించిన పదాలు, సన్నివేశాలు ఇవే
సెన్సార్ బోర్డు నియమించిన 11 మందితో కూడిన రివిజన్ కమిటీ ఈ సినిమాను వీక్షించినట్లు తెలుస్తోంది. కొన్ని సంభాషణలు, సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని గుర్తించి మార్పులు సూచించింది. ముఖ్యంగా బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం తెలిపిన “పిలక”, “గిలక” వంటి పదాలను పూర్తిగా తొలిగించడంతో పాటు, సబ్ టైటిల్స్ లో కూడా ఆ పదాలు వాడకూడదని సూచించారు.అలాగే “చవట” అనే పదాన్ని కూడా సందర్భానికి తగ్గట్టుగా మార్చాలని ఆదేశించారు. “నీచ జాతి” అనే పదాన్ని పూర్తిగా తొలగించాల్సిందిగా సూచించారు. కొన్ని హింసాత్మక సన్నివేశాలు, ముఖ్యంగా ఖడ్గంపై రక్తాన్ని తుడిచి ముఖానికి పట్టే దృశ్యం తొలగించారు.
సెన్సార్ టాక్
సెన్సార్ సభ్యులు ఈ చిత్రం చూశాక తమ ఒపీనియన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో భక్తి కన్నా యాక్షన్, వయలెన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపారట. అయితే, ప్రభాస్ పాత్ర ఎంట్రీ తర్వాత ఈ చిత్రం పూర్తిగా భక్తిరసంతో, ఎమోషనల్ గా మారుతుందని సమాచారం. ఓవరాల్ గా కన్నప్ప చిత్రం మంచి ప్రయత్నం అని అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రీకాళహస్తి మహత్యం ఆధారంగా..
ఈ చిత్రంలో భక్తి నేపథ్యంలో తెరకెక్కింది కాబట్టి అనేక విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకు తగిన విధంగా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభానికి ముందు కీలకమైన డిస్క్లెయిమర్‌ను చేర్చారట. ఇది ధూర్జటి రచించిన శ్రీకాళహస్తి మహత్యం ఆధారంగా రూపొందించబడినదని, కొన్ని సినిమాటిక్ లిబర్టీలు తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకుల అనుమతి తీసుకున్నట్టు కూడా అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ కి ముందు ఒక ప్రకటన విడుదల చేస్తూ హెచ్చరిక జారీ చేసింది. కన్నప్ప చిత్రాన్ని, ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాటాదారులను కించపరిచేలా .. పరువుకు నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరించినా, కామెంట్స్ చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. కానీ కన్నప్ప చిత్రాన్ని కించపరిచేలా కామెంట్స్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సెన్సార్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, తెలుగు వెర్షన్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ జూన్ 26 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్ర తారలు గెస్ట్ రోల్స్ లో నటించారు.