హరిహర వీరమల్లు చిత్ర మలయాళం వెర్షన్ థియేట్రికల్ హక్కులని ఒక స్టార్ హీరో సొంతం చేసుకున్నారు. తెలుగులో వరుస హిట్లు కొడుతున్న ఆ స్టార్ హీరో పవన్ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నెల 12నే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్, రిలీజ్ సన్నాహకాలకి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ మలయాళీ రిలీజ్ గురించి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది.
హరిహర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
మలయాళ సినీ పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందుతున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో కీలక అడుగు వేశారు. సీతారామం,లక్కీ భాస్కర్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన దుల్కర్ తన మార్కెట్ ని ఇక్కడ పెంచుకున్నాడు. తెలుగు సినిమాతో మరింత అనుభందం పెంచుకోవాలని దుల్కర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు మలయాళం వెర్షన్ ని కేరళలో రిలీజ్ చేసేందుకు దుల్కర్ ముందుకు వచ్చారు.
తన వేఫారర్ ఫిలిమ్స్ (Wayfarer Films) బ్యానర్ ద్వారా పలు మలయాళ చిత్రాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తూ విజయాలు సాధిస్తున్న దుల్కర్, తాజాగా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా హరి హర వీర మల్లు మలయాళ వెర్షన్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో..
జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపుదిద్దుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా అలరించనుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ తన సంస్థ ద్వారా ఈ మలయాళ వెర్షన్‌ను రిలీజ్ చేయడం తెలుగు సినిమాల వ్యాప్తిని మరింతగా పెంచుతున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మరింత ఎదుగుతున్నారని అంటున్నారు.
తెలుగు సినిమాపై దుల్కర్ సల్మాన్ ముద్ర
సీతా రామం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ చిత్రంతో తెలుగు హీరోలకు పోటీగా మార్కెట్ సంపాదించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన ఈ వ్యూహాత్మక పంపిణీ నిర్ణయం దక్షిణాది సినిమా పరిశ్రమలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
వేఫారర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కేరళలో తెలుగు సినిమాలకు కొత్త మార్కెట్ అవకాశాలు సృష్టించనున్న దుల్కర్, భవిష్యత్తులో ఇంకెన్ని తెలుగు చిత్రాలని రిలీజ్ చేస్తారో చూడాలి. హరి హర వీర మల్లు విడుదలతో దుల్కర్, పవన్ కళ్యాణ్ కలయికకు మలయాళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ చిత్రం ఇదే.
