టాలీవుడ్ సీనియర్ నటి రమ్యశ్రీ తో పాటు ఆమె సోదరుడు ప్రశాంత్‌ పై హైదరాబాద్ లో దాడి జరిగింది. ఈ దాడికి కారకులైనవారిపై కంప్లైట్ కూడా చేశారు రమ్య. వారిపై దాడి చేసింది ఎవరు?

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎఫ్.సి.ఐ కాలనీలోని లే అవుట్‌లో రోడ్లు మార్కింగ్ చేస్తుండగా, ప్లాట్ ఓనర్లపై దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రముఖ సినీనటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ లక్ష్యంగా దాడి జరిగినట్టు తెలుస్తోంది. .

హైడ్రా సంస్థ ఆధ్వర్యంలో కాలనీలో రోడ్లు మార్కింగ్ జరుగుతున్న వేళ, పలువురు ప్లాట్ యజమానులు అక్కడికి చేరుకుని వీడియోలు తీస్తుండగా, సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు వారిపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటి రమ్యశ్రీ తో పాటు ఆమె సోదరుడు ప్రశాంత్‌ను కత్తులు, క్రికెట్ బ్యాట్‌లతో బెదిరించి హింసించారని తెలుస్తోంది.

దాడిలో గాయపడిన రమ్యశ్రీ , ఆమె సోదరుడు, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దాడిపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే దుండగులు దాడికి పాల్పడ్డారు. మమ్మల్ని హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు దిగారు, అని రమ్యశ్రీ పోలీసులకు తెలియజేశారు.

ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే సంఘటన జరిగిన ప్రదేశం పోలీస్ స్టేషన్‌కు ఎంతో సమీపమై ఉండటంతో, దీనిపై స్థానికంగా, సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చ నడుస్తోంది.

సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరుల వేధింపులకు అడ్డుకట్ట వేయాలని రమ్యశ్రీ పోలీసులను కోరారు. తమ ప్రాపర్టీ విషయంలో న్యాయమైన నడతతో వ్యవహరిస్తున్న సమయంలో ఈ తరహా దాడులు భద్రతపై ప్రశ్నలు పెంచుతున్నాయని ఆమె అన్నారు.