Telangana E-City: తెలంగాణ ఈ సిటీ ప్రాజెక్టు రాష్ట్ర పరిశ్రమల రంగానికి మైలురాయి కానుందని మంత్రి శ్రీధ‌ర్ బాబు తెలిపారు. ఈ-సిటీ కేవలం పరిశ్రమల కేంద్రంగా మాత్రమే కాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాల వేదికగా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా సాంకేతిక మద్దతుగా నిలవనుందని తెలిపారు.  

Telangana E-City: తెలంగాణ ప్రభుత్వం భారీ ప్ర‌ణాళిక‌లో భాగంగా ఫ్యూచ‌ర్ సిటీ (Future City) ప్రాజెక్టు కింద అత్యాధునిక ‘ఈ-సిటీ’ (E-City) ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 1000 ఎకరాల్లో 5G నెట్‌వర్క్‌లు, సర్వర్లు, నెట్‌వర్కింగ్ పరికరాల తయారీకి కేంద్రంగా పనిచేసే పరిశ్రమ ఏర్పడనుంది. దీనివల్ల 2,500 మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. సేరా నెట్‌వర్క్స్ (తైవాన్), LCGC రిజల్యూట్ గ్రూప్ (తెలంగాణ) కలిసి ₹300 కోట్లు పెట్టుబడి పెడతాయని మంత్రి తెలిపారు. టైర్ 2, టైర్ 3 నగరాల్లో పరిశ్రమలు పెట్టే వారు ప్రత్యేక ప్రోత్సాహకాలను పొందనున్నారు. ఈ ప్రాజెక్టు భారత-తైవాన్ వ్యాపార సంబంధాలను బలపరిచే అవకాశముంది.

తెలంగాణలో 'ఈ-సిటీ': ఫ్యూచ‌ర్ సిటీ ప్రాజెక్టులో మ‌రో ముంద‌డుగు 

తెలంగాణ ప్రభుత్వం తన ప్రగతిశీల దృష్టితో మరో గొప్ప టెక్నాలజీ ముందడుగు వేసింది. రాష్ట్ర ఐటీ అండ్ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శ‌నివారం జరిగిన సమావేశంలో ఈ-సిటీ (Electronic City) ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఇది 1,000 ఎకరాల Future City ప్రాజెక్టు లో భాగంగా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ హబ్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సిటీలో పెట్టుబడులు, మౌలిక వసతులు

శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో తైవాన్‌కు చెందిన సెరా నెట్ వ‌ర్క్స్, తెలంగాణ కేంద్రంగా ఉన్న LCGC Resolute Group సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టులో రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ సమావేశానికి TGIIC సీఈఓ మధుసూదన్, T-Fiber ఎండీ వేణు ప్రసాద్, Sera Networks ప్రతినిధులు చువాన్, జాయ్ భట్టాచార్య, డగ్లస్, LCGC గ్రూప్ నుంచి రన్వీందర్ సింగ్, గీతాంజలి సబర్వాల్ హాజరయ్యారు.

ఈ సిటీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు

శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి త్వ‌ర‌గా ప‌నులు పూర్త‌య్యేంద‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అనుమ‌తుల విష‌యంలో జాప్యాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, టైర్ 2, టైర్ 3 నగరాల్లో పరిశ్రమలు నెలకొల్పే ఉద్దేశం ఉన్న పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి సంస్థ అవసరాలను బట్టి వారికి అనుగుణంగా మౌలిక వసతులు అందిస్తామని వెల్లడించారు.

ఈ సిటీతో భారీ ఉద్యోగాలు

ఈ-సిటీ సుమారు 1000 ఎకరాల్లో నిర్మించబోతున్నారు. టెలికాం పరికరాలు, నెట్‌వర్కింగ్ పరికరాల తయారీల‌కు ముఖ్య కేంద్రంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 5G నెట్‌వర్క్స్, మల్టీ లేయర్ నెట్‌వర్కింగ్ సొల్యూషన్స్, సర్వర్లు వంటి అధునాతన పరికరాల తయారీపై దృష్టి సారించనుంది. దీని ద్వారా సుమారు 2,500 మందికి ఉద్యోగావకాశాలు ల‌భించ‌నున్నాయి.