TB Free India Campaign: 2024 లో టీబీ నిర్మూలనలో సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. సాంకేతికత, ప్రజల భాగస్వామ్యం, పరిశుభ్రత టీబీ నిర్మూలనకు కీలకమని అన్నారు.
TB Free India Campaign: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తన నివాసంలో జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (NTEP) పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2024 లో TB ని త్వరగా గుర్తించడం, చికిత్స అందించడంలో జరిగిన పురోగతిని మెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని సూచించారు.
భారతదేశం 2025 నాటికి టీబీని పూర్తిగా నిర్మూలించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రపంచ టార్గెట్ అయిన 2030 కంటే ఐదు సంవత్సరాల ముందే. ప్రభుత్వ డేటా ప్రకారం, 2024 సంవత్సరంలో 2.6 మిలియన్ (26 లక్షల) కొత్త టీబీ కేసులు నమోదు అయ్యాయి.
జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం (National Tuberculosis Elimination Programme - NTEP) కింద, భారత ప్రభుత్వం టిబి నిర్ధారణ, వైద్య చికిత్స, ఆర్థిక సహాయంపై గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. అధునాతన డయగ్నోస్టిక్స్, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, రోగుల కోసం ప్రాధాన్యతను కలిగించే విధానాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
100-రోజుల TB రహిత భారత్ కార్యక్రమం విజయాలు
12.97 కోట్ల మందిపై స్క్రీనింగ్, 7.19 లక్షల TB కేసులను గుర్తించిన 100-రోజుల కార్యక్రమాన్ని సమీక్షించారు. వీటిలో 2.85 లక్షల కేసులు లక్షణాలు లేనివి. లక్షకు పైగా నిక్షయ్ మిత్రులు ఈ కార్యక్రమంలో చేరారు.
శ్రామికులు, పట్టణ-గ్రామీణ డేటా విశ్లేషణ
TB రోగుల డేటాను పట్టణ-గ్రామీణ, వృత్తుల వారీగా విశ్లేషించాలని మోడీ సూచించారు. నిర్మాణం, మైనింగ్, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసేవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిక్షయ్ మిత్రులు ఇంటరాక్టివ్ టెక్నాలజీ ద్వారా రోగులకు అవగాహన కల్పించాలన్నారు.
TB పై భయం కాదు, అవగాహన ముఖ్యం
TB కి చికిత్స ఉంది, భయం వద్దు, అవగాహన పెంచాలి అని ప్రధాని అన్నారు. పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం TB నిర్మూలనకు ముఖ్యమన్నారు.
WHO నివేదికలో భారత్ ఘనత
2015-2023 మధ్య TB కేసుల్లో 18%, మరణాల్లో 21% తగ్గుదల నమోదైందని WHO నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ సగటు కంటే రెట్టింపు. 85% చికిత్స అందుబాటులో ఉంది.
సాంకేతికత, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు
8,540 NAAT ల్యాబ్స్, 87 డ్రగ్ సస్సెప్టిబిలిటీ ల్యాబ్స్, 26,700 X-ray యూనిట్లు (500 AI-సహిత హ్యాండ్హెల్డ్ X-ray) ఉన్నాయని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఉచిత స్క్రీనింగ్, చికిత్స, పోషకాహారం అందిస్తున్నారని తెలిపారు.
కొత్త పథకాలు: AI X-ray, పోషకాహారం, డిజిటల్ సొల్యూషన్స్
AI X-ray, డ్రగ్ రెసిస్టెంట్ TB కి చిన్న చికిత్స, స్వదేశీ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ ప్రారంభించారు. నిక్షయ్ పోషణ యోజన ద్వారా 1.28 కోట్ల మందికి DBT ద్వారా ₹1,000 సాయం అందిస్తున్నారు. 2.55 లక్షల నిక్షయ్ మిత్రులు 29.4 లక్షల ఫుడ్ బాస్కెట్స్ పంపిణీ చేశారు.
ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, ప్రధాని ప్రధాన కార్యదర్శి డా. పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్, అమిత్ ఖరే, ఆరోగ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
