Pakistan radiation leak: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌లో రేడియేషన్ లీక్ అయ్యిందంటూ వైరల్ అవుతున్న డాక్యుమెంట్‌తో కలకలం మొదలైంది. నిజంగానే పాకిస్తాన్ లో రేడియేషన్ లీగ్ అవుతోందా? వైరల్ కథనాల్లో నిజమెంతా? అసలు ఏం జరిగింది?
Nuclear radiation leak in pakistan: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ ఉత్తర ప్రాంతంలో రేడియేషన్ లీక్ అయ్యిందనే వార్తలు ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి ‘అత్యవసర ప్రకటన’ అంటూ వైరల్ అవుతున్న డాక్యుమెంట్ ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. భారత్ దాడితోనే ఇలా జరిగిందంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఆ రిపోర్టులో నిజమెంతా? నిజంగానే పాక్ లో రేడియేషన్ లీక్ అవుతోందా? ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్తాన్ లోని కైరానా హిల్స్ ప్రాంతంలోని పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్.. భారత్ దాడిలో దెబ్బతినడంతో రేడియేషన్ లీక్ అవుతోందని సంబంధిత వైరల్ నోట్ లు పేర్కొంటున్నాయి. ‘రేడియోలాజికల్ సేఫ్టీ బులెటిన్’ పేరుతో ఉన్న ఈ డాక్యుమెంట్, పాకిస్థాన్‌లోని చత్తర్ ప్లెయిన్ సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో రేడియేషన్ లీక్ అయ్యిందని పేర్కొంది. ‘CONFIDENTIAL – IMMEDIATE RELEASE’ అని ముద్రించిన ఈ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో కిరానా హిల్స్‌లోని పాకిస్థాన్ అణు నిల్వలను లక్ష్యంగా చేసుకుందనే ఊహాగానాలపై ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి స్పందించిన ఒక రోజు తర్వాత ఈ డాక్యుమెంట్ వెలుగులోకి వచ్చింది.
“కిరానా హిల్స్‌లో అణు కేంద్రం ఉందని మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు… మేము కిరానా హిల్స్‌ను టార్గెట్ చేయలేదు” అని ఆయన సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.
వైరల్ డాక్యుమెంట్‌లో ఏముంది?
మే 13, 2025 నాటి ఈ డాక్యుమెంట్, మే 11, 2025న “24:55 గంటలకు” జరిగిన రేడియేషన్ సంఘటనను ప్రస్తావించింది. ఇది అసలు ఉనికిలో లేని టైమ్‌స్టాంప్. ‘రేడియోలాజికల్ సేఫ్టీ బులెటిన్’గా పేర్కొనబడిన ఈ డాక్యుమెంట్, నేషనల్ రేడియోలాజికల్ సేఫ్టీ డివిజన్ (NRSD) నుంచి వచ్చిందని చెబుతోంది. అయితే, ఇలాంటి సంస్థ ఉనికి గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చత్తర్ ప్లెయిన్ సమీపంలోని నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (NDT) యూనిట్‌లో నిర్వహణ సమయంలో ఇండియం-192 లీక్ అయ్యిందని ఈ బులెటిన్ పేర్కొంది.
డాక్యుమెంట్‌లోని కీలక అంశాలు:
- సంఘటన సమయం: మే 11, 2025 “24:55 గంటలకు”
- రేడియేషన్ మూలం: ఇండియం-192
- ఎక్స్‌పోజర్ స్థాయి: ప్రారంభంలో 14.2 mSv/గంట, మే 13 నాటికి 0.05 mSv/గంటకు తగ్గింది
- ప్రాణనష్టం: ఒక టెక్నీషియన్‌కు స్వల్పంగా ఎక్స్‌పోజర్, పరిశీలనలో ఉన్నారు
- ప్రతిస్పందన: PAEC, NDMA బృందాలు రెండు గంటల్లో లీకేజీని అదుపు చేశాయి
- ప్రజలకు సూచన: భయపడాల్సిన అవసరం లేదు; 2 కి.మీ. వ్యాసార్థంలో వైద్య పరీక్షలు ప్రారంభించారు
- IAEAకి సమాచారం అందించారు

Fact Check: డాక్యుమెంట్ నిజమేనా?
ఈ డాక్యుమెంట్ అధికారికంగా కనిపించినప్పటికీ, దగ్గరగా పరిశీలిస్తే అనేక అసంగతలు కనిపిస్తాయి. ఇది నకిలీదనే అనుమానాలను రేకెత్తిస్తోంది. మొత్తం పరిశీలన తర్వాత నకిలీ అని తేలింది.
సమయంలో లోపం: “24:55 గంటలు” అనేది ప్రామాణికం కాని, అసాధ్యమైన సమయం. 24-గంటల గడియారం 23:59తో ముగుస్తుంది. 24.55 గంటలు ఎలా వస్తుంది?
భాష, స్పెల్లింగ్‌లో లోపాలు: డాక్యుమెంట్ పూర్తిగా స్పెల్లింగ్,వ్యాకరణ దోషాలు ఉన్నాయి. అధికారిక నోట్ లో ఇలాంటి తప్పులు సాధారణం కాదు.
- “industrialirological site”
- “duiring”, “shickling mechantem”, “teak”, “scignificant”
అధికారిక ప్రభుత్వ డాక్యుమెంట్లలో ఇలాంటి తప్పులు ఉండవు.
సంస్థాగత అసమతుల్యత: వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రేడియోలాజికల్ సంఘటనలను నిర్వహించదు. ఇవి సాధారణంగా పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ (PNRA) లేదా పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ (PAEC) పరిధిలోకి వస్తాయి. ‘నేషనల్ రేడియోలాజికల్ సేఫ్టీ డివిజన్ (NRSD)’ అనేది పాకిస్థాన్ ప్రభుత్వ రికార్డులు లేదా వెబ్‌సైట్‌లలో కనిపించదు.
వర్గీకరణలో అసంగతం: డాక్యుమెంట్‌పై ‘CONFIDENTIAL’ ‘IMMEDIATE RELEASE’ అని ముద్రించారు. ఇది వర్గీకరణలో వైరుధ్యం. గోప్యమైన డాక్యుమెంట్లను ప్రజలకు విడుదల చేయకూడదు.
అధికారిక ధ్రువీకరణ లేదు: ఈ నోట్ వైరల్ గా మారినప్పటికీ పాక్ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు జారీ కాలేదు:
- IAEA (ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ)
- PNRA, PAEC, లేదా పాకిస్థాన్ సమాఖ్య ప్రభుత్వం
- మే 13, 2025 నాటికి పాకిస్థాన్‌లో రేడియోలాజికల్ సంఘటనకు సంబంధించి IAEA వెబ్‌సైట్‌లో ఎలాంటి నవీకరణ లేదా సలహా లేదు.
సంతకం, సంప్రదింపు వివరాలు: డాక్యుమెంట్‌పై సంతకం చేసిన Engr. మాలిక్ అసద్ రఫీక్ అనే అధికారి పేరు పాకిస్థాన్ రేడియేషన్ లేదా పర్యావరణ సంస్థల డైరెక్టరీలలో కనిపించదు. “nrsd@env.gov.pk” అనే ఈమెయిల్ డొమైన్ చెల్లుబాటు అయ్యేది కాదు.
Grok ఫ్యాక్ట్-చెక్ ఏమంది?
దావాల తీవ్రత ఉన్నప్పటికీ, పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ (PNRA), IAEA లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ దీనిని ధ్రువీకరించలేదు.
Xలో Grok ఫ్యాక్ట్-చెక్ ఇలా పేర్కొంది: “మే 13, 2025 నాటికి పాకిస్థాన్‌లో రేడియేషన్ లీక్ అయ్యిందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవు.”
వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ “రేడియోలాజికల్ భద్రతను నిర్వహించదు” అని, లేఖ ఫార్మాట్ “నకిలీదని సూచిస్తోంది” అని Grok పేర్కొంది. వాంతులు లేదా తలనొప్పి వంటి లక్షణాలకు సంబంధించి ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితులు లేవని మరో Grok పోస్ట్ తెలిపింది.
“ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తప్పుడు సమాచార ప్రచారాలకు దారితీసి ఉండవచ్చు, కానీ ఈ డాక్యుమెంట్‌కు విశ్వసనీయత లేదు” అని మరో Grok ప్రతిస్పందన తెలిపింది.
ఇప్పటివరకు, పాకిస్థాన్‌లో రేడియేషన్ లీక్ అయ్యిందనే వాదనకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. IAEA వెబ్‌సైట్‌లో కూడా ఎలాంటి సమాచారం లేదు.
అయితే, నకిలీదని భావిస్తున్న ఈ వైరల్ డాక్యుమెంట్ ఉపఖండంలో అణు భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.
గమనిక: ఈ వైరల్ డాక్యుమెంట్ ప్రామాణికతను Asianet News Telugu ధ్రువీకరించలేదు. అధికారులు అధికారికంగా ధ్రువీకరించే వరకు దీనిలోని అంశాలను జాగ్రత్తగా పరిగణించాలని పాఠకులకు సూచిస్తున్నాము.
