పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహాయం చేస్తున్నట్టు భారత్ బయటపెట్టడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇకపై పాకిస్తాన్ చేసే ఏ ఉగ్రవాద చర్యనైనా భారత్‌పై యుద్ధంగా పరిగణిస్తామని, దానికి తగ్గ ప్రతిస్పందన ఉంటుందని భారత్ నిర్ణయించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడుల ప్రయత్నాల నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఉగ్రవాదులకు, తమ సైన్యానికి సంబంధం లేదని పాకిస్తాన్ సర్కార్ చెబుతూనే ఉంది. ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు అందిస్తూ పాక్ ప్రోత్సహిస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ దొంగ బుద్ధిని బయటపెట్టింది.

భారత్ సైనిక చర్యలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనిక అధికారులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు దీన్ని ధ్రువీకరించాయి.

విదేశాంగ శాఖ హెచ్చరిక:

పాకిస్తాన్ దాడుల ప్రయత్నాలు పరిస్థితిని ఉద్రిక్తం చేస్తాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ తెలిపారు. పాకిస్తాన్ చర్యలకు భారత్ దీటుగా ప్రతిస్పందిస్తుందని అన్నారు.

పాక్ సైన్యం భారత్ పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేస్తోందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. గురువారం రాత్రి భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ డ్రోన్లు, దూర ప్రాంత ఆయుధాలు, యుద్ధ విమానాలను ఉపయోగించిందని ఆమె చెప్పారు.

షెహబాజ్ షరీఫ్ సమావేశం:

భారత్‌పై పాకిస్తాన్ సైనిక చర్య ప్రారంభించి అనేక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. పాకిస్తాన్ ప్రయత్నాలను భారత సైన్యం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం సైనిక అధికారులతో సమావేశమయ్యారు.

పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలపై నిర్ణయం తీసుకునే అధికారం గల కమిషన్ సమావేశం జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ, ప్రధాని షరీఫ్ అధ్యక్షతన ఎలాంటి సమావేశం జరగలేదని రక్షణ మంత్రి ఖండించారు.

అణ్వాయుధాల ఉపయోగంపై వచ్చిన ప్రశ్నకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ, ఆ స్థితి రావడానికి ఇంకా చాలా దూరం ఉందని అన్నారు. "ఆ స్థితి రాకముందే ఉద్రిక్తతలు తగ్గుతాయని నేను భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.