పాకిస్థాన్ లో అంతర్గత అలజడి రేగుతుందని.. ఆ దేశం రెండుగా విడిపోతుందంటూ సీనియర్ బిజెపి నేత కవిందర్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. భారత ఆర్మీ 'ఆపరేషన్ సింధూర్' తర్వాత పాక్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన అన్నారు.
భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సింధూర్' పేరిట ఉగ్రవాదులను అంతమొందించే పనిలోపడ్డాయి. ఇందులో భాగంగానే పాకిస్థాన్ లోకి చొరబడిమరీ ఉగ్రవాద స్థావరాలపై దాాడులకు దిగింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంపై సీనియర్ బిజెపి నాయకుడు కవిందర్ గుప్తా ఆసక్తికర కామెంట్స్ చేసారు. పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చాలా కీలక పరిణామంగా పేర్కొన్నారు. ఉగ్రవాదులను అంతమొందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్న మోదీ ప్రభుత్వాన్ని, భద్రతా దళాలను ప్రశంసించారు కవి గుప్తా.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ... ఉగ్రవాదులు "మోదీకి చెప్పమని" అన్నారు, "ఈరోజు మోదీజీ చెప్పేశారు" అని అన్నారు. భారతదేశ శత్రువులకు ఇది ఒక శక్తివంతమైన సందేశమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సంకల్పానికి ఇది గట్టి రిమైండర్ అని ఆయన అభివర్ణించారు.
పాకిస్తాన్ సానుభూతిపరుల చెంప చెళ్లుమనేలా భారత్ వ్యవహరించిందన్నారు. భారత సైన్యం సాహసోపేతమైన చర్యకు దేశం ఐక్యంగా అభినందనలు తెలియజేయాలని అన్నారు. ఇకనైనా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపాలన్నారు.
కవి గుప్తా ఒక అడుగు ముందుకేసి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో పరిస్థితులు మారిపోతాయని... దేశం రెండుగా విడిపోతుందని అంచనా వేశారు. "పాకిస్తాన్ ఎక్కువ కాలం ఉండదు" అని ఆయన అన్నారు, ఆ దేశం త్వరలో అనేక భాగాలుగా విడిపోయి ప్రపంచ పటం నుండి అదృశ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో అంతర్గత అశాంతి మరియు ఆర్థిక సంక్షోభం దాని రాబోయే పతనానికి సంకేతాలుగా కవి గుప్తా పేర్కొన్నారు.
జైష్-ఎ-మొహమ్మద్ కేంద్రంగా పేరుగాంచిన బహవల్పూర్‌లోని ప్రదేశాలతో సహా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభించినట్లు ధృవీకరించిన తర్వాత బిజెపి నాయకుడి వ్యాఖ్యలు వచ్చాయి. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గాం దాడికి ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయి.
