వైట్‌హౌస్ బాధ్యతలతో టెస్లాకు సమయం కేటాయించలేకపోతున్న ఎలాన్ మస్క్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించేందుకు టెస్లా బోర్డు యోచిస్తోందా? కంపెనీ లాభాలు, అమ్మకాలు తగ్గడంతో కొత్త సీఈఓ కోసం అన్వేషణ మొదలైందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను సిఈవో పదవి నుండి తప్పించేందుకు టెస్లా బోర్డు కీలక చర్యలు తీసుకుంటోందనే ప్రచారం ఊపందుకుంది. మస్క్ ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఉంటూ వైట్‌హౌస్ బాధ్యతలపై అధికసమయం కేటాయిస్తుండటంతో కంపెనీ పనితీరుపై ప్రభావం పడుతుందని... ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో జరిగిన ప్రచారంలో ముఖ్యపాత్ర పోషించారు. దీంతో ఆయన్ను వైట్‌హౌస్‌లోని డీపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషెన్సీ (DOGE)కు అధిపతిగా నియమించారు. ఈ విభాగం ప్రధానంగా కేంద్ర ఖర్చులను తగ్గించేందుకు, ప్రభుత్వ శాఖలను సమర్థవంతంగా పనిచేయించేందుకు ఏర్పాటు చేశారు.
అయితే ఈ రాజకీయ భాద్యతల మధ్య మస్క్ టెస్లాకు సమయం కేటాయించలేకపోతున్నారని... దీంతో టెస్లా లాభాలు, అమ్మకాలు తీవ్రంగా తగ్గుతున్నాయని బోర్డు సభ్యులు భావిస్తున్నారు. 2025 తొలి త్రైమాసికంలో టెస్లా లాభాలు ఏకంగా 71% పడిపోయాయి. మొత్తం ఆదాయం 9 శాతం తగ్గినప్పటికీ, ఆటోమొబైల్ విభాగ ఆదాయం 20 శాతం తగ్గింది.
ఈ నేపథ్యంలో టెస్లా బోర్డు పలు ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థలను సంప్రదించి కొత్త సిఈవో కోసం ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ హైరింగ్ సంస్థతో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ మొత్తం ప్రక్రియలో మస్క్‌కు పూర్తిగా సమాచారం ఉందో లేదో స్పష్టంగా తెలియరాలేదు. కానీ ఆయన కూడా బోర్డులో సభ్యుడే కావడంతో సమాచారం లేకపోవడం అనుమానాస్పదంగా ఉంది.
ఇక ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో మస్క్‌కు టెస్లాపై మరింత సమయాన్ని కేటాయించాలన్న సూచనలు వచ్చినట్టు సమాచారం. దీనిపై స్పందించిన మస్క్ వచ్చే నెల నుంచి టెస్లాపై ఎక్కువ సమయం కేటాయించబోతున్నానని టెస్లా అర్ధిక ఫలితాల సమావేశంలో పేర్కొన్నారు.
అంతేకాక అధ్యక్షుడు ట్రంప్ కూడా బుధవారం జరిగిన సమావేశంలో మస్క్‌ను అభినందిస్తూ... మీ సేవలకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికైనా ఇక్కడే ఉండవచ్చు. కానీ మీరు మీ కార్ల దగ్గరికి తిరిగి వెళ్లాలనుకుంటున్నట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
మస్క్ రాజకీయ మద్దతుతో టెస్లా బ్రాండ్ ఇమేజ్‌కు కూడా దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కేలిఫోర్నియా, జర్మనీ వంటి ప్రాంతాల్లో టెస్లా విక్రయాలు పడిపోవడంతో పాటు, మస్క్‌కు వ్యతిరేకంగా టెస్లా వినియోగదారులు స్టిక్కర్లు కూడా అంటించుకుంటున్నారు.
ఇక మస్క్ రూ.250 మిలియన్ల డొనేషన్‌తో ట్రంప్ ప్రచారానికి మద్దతుగా నిలవగా, ఈవి విధానాలను విమర్శించిన ట్రంప్ కారణంగా కంపెనీ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. టెస్లా తన స్వచ్ఛశక్తి లక్ష్యాలపైనే నిలబడుతుందన్న నమ్మకాన్ని తిరిగి పొందాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ టెస్లా సిఈవో పదవి కొనసాగుతారో లేదో అన్నది అనుమానాస్పదంగా మారింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను తిరిగి స్థిరీకరించాలంటే, మస్క్ మరింత సమయం టెస్లాకు కేటాయించాల్సిన అవసరం ఉంది.
