- Home
- Telangana
- Telangana Rains : అయ్యోపాపం... అన్నదాతలను వరుణుడు కూడా కరుణించడంలేదే, ఈ నెలా లోటు వర్షపాతమే
Telangana Rains : అయ్యోపాపం... అన్నదాతలను వరుణుడు కూడా కరుణించడంలేదే, ఈ నెలా లోటు వర్షపాతమే
అన్నదాాతలను ఆ వరుణుడు కూడా కరుణించడం లేదు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే నమోదయ్యింది. భారీ వర్షాల కోసం రైతులు ఆకాశంవైపు ఆర్తిగా చూస్తున్నారు.. అయినా వానజాాడ కనిపించడంలేదు.

రైతుల పరిస్ధితి ఇంతేనా?
Telugu States Weather Updates : నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయని తెలుగు ప్రజలు సంబరపడ్డారు... మే చివర్లోనే వర్షాలు మొదలవడంతో ఈసారి కాలం బాగుంటుందని భావించారు. కానీ వారి ఆనందం ఎక్కువకాలం నిలవలేదు... మేలో ఆశలు రేకెత్తించిన వర్షాలు ముఖం చాటేశాయి. ఉత్తరాదిన కుండపోత వర్షాలు కురుస్తున్నవేళ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చుక్క వర్షం పడలేదు... ఇలా జూన్ మొత్తం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో లోటు వర్షపాతమే నమోదయ్యింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు మరీముఖ్యంగా రైతుల్లో ఆందోళన మొదలయ్యింది.
జూన్ లో సాధారణంగా కురవాల్సిన వర్షాల కంటే చాలా తక్కువ కురిశాయి... తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా లోటు వర్షపాతం నమోదయ్యింది. ఈ లోటును పూడ్చేలా జులైలో జోరు వానలుంటాయని భారత వాతావరణ శాఖ (IMD) తో పాటు ఇతర వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంతో ఇరురాష్ట్రాల్లో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు కాస్త ఊరట చెందారు. కానీ ఇప్పటికే జులైలో సగంరోజులు ముగిసాయి... కానీ వర్షాల జాడలేదు. ఈ నెల ఆరంభంలో కురిసిన చెదురుమదురు జల్లులే ఇప్పటివరకు కురిసిన పెద్ద వర్షాలు.
తెలంగాణ విషయానికి వస్తే సాధారణంగా వర్షకాలంలో ఇప్సటివరకు రాష్ట్రవ్యాప్తంగా 185 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుకావాలి. కానీ కేవలం 165 సెంటిమీటర్లే కురిసింది. అంటే 20 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. ఈ లోటు వర్షాధార పంటలు వేసిన రైతులకు నిండా ముంచేలా ఉంది. మేలో కురిసిన తొలకరి వర్షాలతో విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు... ఆర్తిగా ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
జులైలో భారీ వర్షాలు లేనట్లేనా?
గత నెల జూన్ లో మాదిరిగానే జులైలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు మందగించడం, ఇప్పట్లో అల్పపీడనాలు, ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడే అవకాశాలు లేవని చెబుతోంది. అంటే మరికొన్నిరోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జాడ ఉండదన్నమాట... చెదురుమదురు జల్లులు పడినా భారీ వర్షాలు మాత్రం ఉండే అవకాశాలు ఉండవట.
తెలంగాణలో ఈ రెండుమూడు రోజులు అంటే జులై 12 నుండి 15 వరకు వర్షాలు లేకపోగా ఎండలు, ఉక్కపోత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఆ తర్వాత జులై 16 నుండి 20 వరకు వర్షాలు కాస్త జోరందుకుంటాయని... కానీ మోస్తరు వర్షాలకే పరిమితం అవుతాయని, భారీ వర్షాలుండవట. ఇక నెలలో మిగిలిన పదిరోజులు కూడా ఆశాజనకంగా వర్షాలేమీ ఉండవని వాతావరణ శాఖ ప్రకటనలను బట్టి తెలుస్తోంది.
వర్షాలు లేకున్నా ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేకున్నా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వానలతో గోదావరి, కృష్ణా నదులకు వరద నీరు చేరుతోంది. దీంతో ఈ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... ఈ రెండు నదులపైని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వరద నీరు పోటెత్తడంతో వివిధ జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది... దీంతో 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,37,635 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1,48,535 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఇక పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 3 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల, నాగార్జున సాగర్ వంటి జలాశయాలు కూడా నిండిపోయాయి. దీంతో ఈ జలాశయాల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
నేడు తెలంగాణలో వర్షాల పరిస్ధితేంటి?
ఇవాళ (జులై 12, శనివారం) తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసాఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో వర్షాలుండవని… ఉక్కపోత పెరిగే అవకావాలున్నాయని తెలిపారు. హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందట.
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇవాళ పలు జిల్లాల్లో చిరుజల్లులు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, బాపట్ల, అల్లూరి, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖపట్నం వంటి సముద్రతీర నగరాల్లో ఉక్కపోత పెరిగే అవకాశాలున్నాయట.