- Home
- National
- Telangana Rain Alert : తెలుగు ప్రజలకు చల్లని కబురు ... భారీ వర్షాలు కురిసే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Telangana Rain Alert : తెలుగు ప్రజలకు చల్లని కబురు ... భారీ వర్షాలు కురిసే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాల రైతులకు చల్లని కబురు. ఇవాాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.

నేడు తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
Telugu States Weather Updates : వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని... దీంతో వర్షాలు జోరందుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ(జూన్ 20) శుక్రవారం ఇరు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
జూన్ 20 తెలంగాణ వాతావరణం
సాధారణంగా జూన్ ఫస్ట్ వీక్ లో వర్షాకాలం ప్రారంభంకావాలి.... కానీ ఈ ఏడాది మేలోనే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. దీంతో ఎండలు మండిపోవాల్సిన సమయంలో వర్షాలు దంచికొట్టాయి. తీరా జూన్ లో అంటే అసలైన వర్షాకాలంలో మాత్రం మేఘాలు ముఖం చాటేసాయి... ఈ నెలలో ఇప్పటికే 20 రోజులు గడిచిపోయినా ఇంకా వర్షాల జాడలేదు.
మే నెలలో కురిసిన వర్షాలతో ఇక ఈ వర్షాకాలం మొత్తం జోరువానలు ఉంటాయని రైతులు భావించారు. దీంతో వ్యవసాయ పనులు ప్రారంభించుకున్నారు. వర్షధార పంటల కోసం భూమిని సిద్దం చేసుకుని కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తుకున్నారు.. మరికొందరు ఇందుకు రెడీగా ఉన్నారు. అయితే వర్షాలు లేకపోవడంతో ఈ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెబుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా మారడంతో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లోకి కూడా మెళ్లిగా ప్రవేశిస్తున్నాయని వాతావరణం శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా తోడవడంతో తెలంగాణలో కూడా వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కొన్నిజిల్లాల్లో వర్షాలు మొదలై తర్వాత రాష్ట్రం మొత్తానికి వ్యాపిస్తాయని తెలిపారు. అంటే ఇక అసలైన వర్షాకాలం మొదలవుతుందన్నమాట.
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
ఇవాళ (జూన్ 20) శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించారు. ఇలా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
జూన్ 20 ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇక వర్షాలు జోరందుకోనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ (శుక్రవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయట. పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. కొన్నిచోట్ల మాత్ర భారీ వర్షాలుండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.