Health Care : 40 ఏండ్లు నిండాయా ? ఈ మార్పులు తప్పనిసరి..
Health Care: మారుతున్న జీవన శైలి, బిజీ లైఫ్ వల్ల చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపడం లేదు. కానీ, 40 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే వీటికి దూరంగా ఉండాలి.

40 ఏళ్లు నిండాయా?
40 ఏళ్లు అనేది ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ వయస్సు తర్వాత జీవక్రియ మందగించి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, ఈ వయస్సు ముందు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు (జిమ్, డైట్, నిద్ర, నడక) అలవర్చుకుంటే.. గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
ధూమపానం
40 ఏళ్లలోపు ధూమపానం మానేయడమే ఆరోగ్యానికి మేలు. ధూమపానం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. 40 ఏళ్ల ముందు మానేస్తే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గి, ఆయుష్షు పెరుగుతుంది. నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, సపోర్ట్ గ్రూప్‌లు, మందులు వంటి మార్గాలు మానేయడంలో సహాయపడతాయి. వైద్యుని సలహా తప్పనిసరి.
మద్యపానం
40 ఏళ్లు దాటిన తరువాత మద్యపానం కు దూరంగా ఉండాలి. మితిమీరిన మద్యపానం వల్ల లివర్ వ్యాధి, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 40 ఏళ్లలోపే మద్యానికి దూరంగా ఉంటే.. లివర్, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది.
జీవనశైలి
నేడు చాలా మంది ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి 40 ఏళ్ల లోపే వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, జాగింగ్, సైక్లింగ్, ఈత లేదా గ్రూప్ గేమ్స్ ఆడటం మంచిది. మెట్లు ఎక్కడం, కొంత దూరం నడవడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి.
ఆహారపు అలవాట్లు:
ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, అధిక చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలు వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి 40 ఏళ్లకు ముందు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొత్తం ధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోండి. చక్కెర పానీయాలు, వేయించిన పదార్థాలు తగ్గించాలి. ఇంట్లో వండుకోవడం, మీ ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకోవడం వల్ల దీర్ఘాయుష్షు పెరుగుతుంది.
ఒత్తిడి నియంత్రణ
నేటి జీవనశైలిలో మానసిక ఒత్తిడి అనివార్యం. ఈ సమస్య ఉంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నిద్రలేమి, మానసిక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి 40 ఏళ్ల ముందు నుంచే ఒత్తిడిని నియంత్రించుకోవడం అవసరం. ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు, అభిరుచులు, స్నేహితులు, కుటుంబంతో సమయం గడపడం లేదా థెరపిస్ట్‌తో మాట్లాడటం వంటి మార్గాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఒత్తిడిని సమర్థంగా నియంత్రించడం వల్ల ఆరోగ్యం మెరుగై, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలరు.