Joint Pain relief tips: 30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్!
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అసలు అంత చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడానికి కారణాలు ఏంటి? వాటి ప్రారంభ లక్షణాలు ఏంటీ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ చూద్దాం.

30 ఏళ్లకే కీళ్ల నొప్పులా?
కీళ్ల నొప్పులు వృద్ధులకే వస్తాయనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు 30 ఏళ్ల వయసులోనే చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ విషయంపై ఫిన్లాండ్‌లోని ఒయులు యూనివర్సిటీలో ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. 30 ఏళ్ల వయసున్న వారి కీళ్లలో దెబ్బతినే సంకేతాలు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
అధ్యయనంలో పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరికి కీళ్లల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనికి ప్రధాన కారణం అధిక బరువు, అధిక రక్తపోటు, జన్యువులు అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. ప్రారంభ లక్షణాలను గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే కీళ్లు దెబ్బతినడాన్ని నివారించవచ్చు. 30 ఏళ్లకే కీళ్ల నొప్పులు రావడానికి గల కారణాలు, ప్రారంభ లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం.
30 ఏళ్లకే కీళ్లు దెబ్బతినడానికి కారణాలు:
- అధిక బరువు కీళ్లపై ఒత్తిడిని కలిగించి, మృదులాస్థి విచ్ఛిన్నానికి, దెబ్బతినడానికి దారితీస్తుంది.
- శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే లేదా అధిక రక్తపోటు సమస్య ఉంటే కీళ్లలో వాపు వస్తుంది. ఈ సమస్యలు మొత్తం కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
- తాత, అమ్మమ్మ లేదా తల్లిదండ్రులకు కీళ్ల సమస్యలు ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ.
- ఒకే చోట కూర్చోవడం, కాళ్లను అస్సలు కదపకుండా ఉండటం లేదా ఎక్కువగా కదపడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి.
- గాయాల వల్ల కూడా కొన్నిసార్లు కీళ్ల నొప్పులు వస్తాయి.
ప్రారంభ లక్షణాలు:
1. గట్టిదనం - ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని, కాళ్లను అస్సలు కదపకుండా ఉంటే కాళ్లలో ఒకరకమైన గట్టిదనం వస్తుంది.
2. వాపు - అప్పుడప్పుడు కీళ్లలో వాపు లేదా లావుగా మారడం
3. శబ్దం - నడుస్తున్నప్పుడు లేదా మోకాలిని వంచినప్పుడు, నిలబెట్టినప్పుడు ఏదైనా శబ్దం వస్తే మీ మృదులాస్థి అరిగిపోయిందని అర్థం.
4. మెట్లు ఎక్కడంలో ఇబ్బంది - మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా కూర్చుని లేచేటప్పుడు నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిస్తే కీళ్లలో సమస్య ఉందని అర్థం.
5. నిరంతర నొప్పి - నడక, జాగింగ్ లేదా ఎక్కువసేపు నిలబడిన తర్వాత మోకాళ్లలో నొప్పి వస్తే మృదులాస్థి బలహీనపడిందని అర్థం
నివారణ మార్గాలు:
- ఆరోగ్యకరమైన బరువు చాలా ముఖ్యం
- నడక, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలు కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగించవు. బదులుగా, అవి కండరాలను బలోపేతం చేసి, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
- నిలబడి ఉన్నప్పుడు ఒక కాలిపై మరొక కాలు ఎప్పుడూ వేయకండి. అలాగే ఏదైనా వస్తువును ఎత్తేటప్పుడు వీపును ఎప్పుడూ వంచకండి. దానివల్ల మోకాళ్లపై ఒత్తిడి కలుగుతుంది.
- విటమిన్ డి, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోండి. ఇవి కీళ్లను బలోపేతం చేస్తాయి.