Health tips: చక్కెరకు బదులు దీన్ని వాడితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయం అందరికీ తెలుసు. అందుకే చాలామంది చక్కెరకు ప్రత్యామ్నాయం వెతుకుతుంటారు. అలాంటి వారికి అల్లూలోస్ వరమనే చెప్పాలి. ఇంతకీ ఏంటీ పదార్థం? చక్కెరకు బదులు దీన్ని ఎందుకు వాడచ్చో ఇక్కడ చూద్దాం.

చక్కెరకు ప్రత్యామ్నాయం..
చక్కెర శరీరానికి హానికరమైన పదార్థంగా మారింది. ఇది డయాబెటిస్ నుంచి ఊబకాయం వరకు అనేక సమస్యలకు దారితీస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అనేక కృత్రిమ స్వీటెనర్లు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే చక్కెరకు ప్రత్యామ్నాయంగా తక్కువ కేలరీల స్వీటెనర్ అయిన అల్లూలోస్‌ను పరిశోధకులు కనుగొన్నారు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.
తక్కువ కేలరీలు కలిగిన అల్లూలోస్
అల్లూలోస్ అనేది ఒక సాధారణ చక్కెర. ఇవి సహజంగా గోధుమ, అత్తి పండ్లు, మొక్కజొన్నలలో కనిపిస్తాయి. ఇది చక్కెరలాగే కనిపిస్తుంది. ఇది సహజంగా తీపి రుచిని కలిగి ఉంటుంది. దీనిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. చక్కెరలో ఒక గ్రాముకు నాలుగు కేలరీలు ఉంటే, అల్లూలోస్‌లో ఒక గ్రాముకు 0.4 కేలరీలు ఉంటాయి. చక్కెర కంటే 90 శాతం తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి కూడా అల్లూలోస్ సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.
చక్కెరలాగే తీపి రుచి..
చక్కెరలాగే ఇది 70% తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇతర కృత్రిమ స్వీటెనర్లలా చేదు రుచి లేదా చల్లని అనుభూతిని కలిగించదు. తక్కువ కేలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి అల్లూలోస్ మంచి ఎంపిక. తీపి రుచిని ఆస్వాదిస్తూ బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కగా సహాయపడుతుంది.
ఎలాంటి దుష్ప్రభావాలు లేవు!
అల్లూలోస్ డయాబెటిస్ ఉన్నవారికి వరం లాంటిది. తీపి పదార్థాలను ఆస్వాదించలేని వారు చక్కెరకు ప్రత్యామ్నాయంగా అల్లూలోస్‌ను తీసుకోవచ్చు. తీపి పదార్థాలు, పెరుగు, ఐస్‌క్రీం, బేకింగ్ చేసిన పదార్థాల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇప్పటివరకు చాలామంది దీన్ని తీసుకోగా.. ఎవరికి ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇది గుర్తుంచుకోండి!
అల్లూలోస్ ను అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉందట. తక్కువ కేలరీలు, రక్తంలో చక్కెరపై ప్రభావం చూపకపోవడం, చక్కెరలాంటి రుచి కలిగి ఉండటం వల్ల చాలామంది దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడేముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అంతేకాదు అది మీ శరీరానికి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవడం కూడా ముఖ్యం.