Food: అంగన్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్.. ఇది తెలిస్తే ఇకపై చచ్చినా పడేయరు
Food: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం బాలామృతం ఇస్తుంటారని తెలిసిందే. చాలా మంది వీటిని ఉపయోగించకుండా చెత్తలో పడేస్తుంటారు. అయితే వీటితో ఎంతో రుచికరమైన రెసిపీలను చేసుకోవచ్చని మీకు తెలుసా.? అలాంటి ఒక మంచి రెసెపీ గురించి మీకోసం.

బాలామృతంతో బిస్కెట్స్
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారంగా ఇచ్చే బాలామృతం పిండి ఇంట్లోనే రుచికరమైన బిస్కెట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పిండిలో అవసరమైన ధాన్యాలు, తీపి పదార్థాలు ముందే ఉండటంతో అదనపు చక్కెర అవసరం ఉండదు. కొద్దిగా నెయ్యి, నీరు ఉంటే సరిపోతుంది.
బిస్కెట్స్ కోసం అవసరమైన పదార్థాలు
ఈ బిస్కెట్స్ తయారీకి ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే సులభంగా చేయొచ్చు.
బాలామృతం పిండి – 3 కప్పులు
ఉప్పు – ఒక చిటికెడు
కరిగించిన నెయ్యి లేదా బటర్ – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
నీళ్లు లేదా కాచి చల్లార్చిన పాలు – అవసరమైనంత
బాదం ముక్కలు – పైకి డెకరేషన్ కోసం
పిండి సిద్ధం చేసే విధానం
ముందుగా ఒక వెడల్పైన గిన్నెలో బాలామృతం పిండి వేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్లీ గిన్నెలోకి తీసుకుని, కొద్దిగా కొద్దిగా నీళ్లు లేదా పాలు పోస్తూ గట్టిగా ఉండేలా పిండి ముద్ద తయారు చేయాలి. ఈ ముద్దను 10–15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
బిస్కెట్ ఆకారం కోసం
నానిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత చేత్తో లేదా గ్లాస్‌తో బిస్కెట్ ఆకారంలో నొక్కాలి. అన్నీ ఒకే సైజులో ఉంటే బేక్ అవ్వడం సులభంగా ఉంటుంది. పైభాగంలో బాదం ముక్కలు పెట్టి తేలికగా నొక్కాలి.
బేక్ చేసే విధానం
మందపాటి కడాయిలో కొద్దిగా ఉప్పు వేసి, లోపల స్టాండ్ పెట్టి మూత మూసి 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలి.
తర్వాత నెయ్యి రాసిన ప్లేట్‌లో బిస్కెట్స్ అమర్చి కడాయిలో పెట్టాలి. మూత పెట్టి లో-టు-మీడియం మంటపై 25–30 నిమిషాల పాటు బేక్ చేయాలి. కింద భాగం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే బిస్కెట్స్ క్రంచీగా ఉంటాయి. బిస్కేట్స్ తయారీకి సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ చూడండి.

