Chicken vs Fish: చికెన్ vs చేపలు.. బరువు తగ్గడానికి ఏం తింటే మంచిది?
చికెన్, చేపలు రెండూ ఆరోగ్యానికి మంచివే. ఇవి తినడం వల్ల చాలా లాభాలున్నాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు చికెన్ తింటే మంచిదా? చేపలు తింటే మంచిదా.. అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మరి ఆ డౌట్ ని ఇక్కడ క్లియర్ చేసుకుందామా..

బరువు తగ్గాలనుకునేవారు ఏం తింటే మంచిది?
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు సాధారణ వ్యాయామాలతో పాటు మంచి ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి. ప్రోటీన్ దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేస్తుంది. ప్రోటీన్ ప్రధానంగా లభించే ఆహార పదార్థాల్లో చేపలు, చికెన్ ముందువరుసలో ఉంటాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు వీటిలో ఏ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునేవారు చేపలు తినడం మంచిదా?
కొన్ని అధ్యయనాల ప్రకారం.. చేపలు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. చేపల్లో కేలరీలు తక్కువ. వీటిని తినడం వల్ల కండరాలు బలపడతాయి. ఎక్కువ శక్తి లభిస్తుంది. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
వరుసగా 8 వారాలు వేరే నాన్ వెజ్ తినకుండా చేపలు మాత్రమే తిన్నవారు.. చేపలు తినని వారికంటే గణనీయంగా బరువు తగ్గారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఎండు చేపల్లో ఎక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి.. బరువు పెరగాలనుకునేవారు ఎండు చేపలు తినవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు చికెన్ తినచ్చా?
బరువు తగ్గాలనుకునే వారు చికెన్ తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని, కండరాలను బలపరుస్తుంది. క్రమంతప్పకుండా చికెన్ తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. వేయించిన చికెన్, ఎక్కువగా ప్రాసెస్ చేసిన చికెన్ ని తినకపోవడమే మంచిది.
బరువు తగ్గడానికి ఏది మంచిది?
బరువు తగ్గాలనుకునేవారు తక్కువ ఉప్పుతో వండిన చికెన్ కర్రీ, సూప్‌లను తీసుకోవచ్చు. మసాలా దినుసులు ఎక్కువగా వేయకుండా ఆవిరిలో ఉడికించిన నాటు కోడి కూర తీసుకుంటే ఇంకా మంచిది. ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు చేపల కంటే చికెన్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
సరైన మోతాదులో తీసుకుంటే..
చేపలు, చికెన్.. రెండూ మంచి ఆహారాలే. బరువు తగ్గాలనుకునే వారు ఈ రెండింటిని తీసుకోవచ్చు. అయితే ఏది తీసుకున్నా.. సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. అప్పుడే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.