- Home
- Feature
- అన్నీ ఉన్నా సంతోషం లేదా.. అయితే మీరు 99 క్లబ్లో ఉన్నట్లే. కథ చదివితే మీ జీవితమే మారుతుంది
అన్నీ ఉన్నా సంతోషం లేదా.. అయితే మీరు 99 క్లబ్లో ఉన్నట్లే. కథ చదివితే మీ జీవితమే మారుతుంది
Motivational story: మనలో కొందరు జీవితానికి సరిపడ ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నా ఏదో లేదన్న లోటుతో ఉంటారు. లేని ఒక్క దాని కోసం బాధపడుతుంటారు. వీరినే 99 క్లబ్ మెంబర్స్‌గా సైకాలజిస్టులు చెబుతుంటారు. దీనిని వివరించే ఓ కథ ఇప్పుడు తెలుసుకుందాం.

సంపద ఉన్నా సంతోషం లేని రాజు
అనగనగా ఓ రాజ్యంలో ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతనికి అపారమైన సంపద, గొప్ప రాజభవనం, సేవకులు, సైన్యం అన్నీ ఉన్నాయి. రాజ్యం కూడా సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఆనందంగా జీవించేవారు. కానీ ఆశ్చర్యకరంగా, ఈ రాజుకు మాత్రం ఎప్పుడూ ఏదో లోటు అనిపించేది. అతనికి కావలసినది అన్నీ ఉన్నా… మనసులో మాత్రం ఒక విచిత్రమైన అసంతృప్తి ఉండేది.
నిద్రలేని రాత్రి – ఆశ్చర్యకరమైన దృశ్యం
ఒక రోజు రాత్రి, రాజుకు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. అలా ఆలోచనల్లో మునిగి రాత్రి 3 గంటల వరకు రాజభవనంలో తిరుగుతూ ఉండిపోయాడు. అప్పుడు రాజదర్భార్ దగ్గర ఓ కార్మికుడు గదిని ఊడుస్తూ కనిపించాడు. అతను చాలా పేదవాడు. కానీ అతను మాత్రం హాయిగా పాటలు పాడుకుంటూ, చిరునవ్వుతో పని చేస్తూ ఉండేవాడు. ఆ దృశ్యం చూసిన రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. “నాకు అంతా ఉన్నా నేను సంతోషంగా లేను… కానీ ఇతను ఇలా హ్యాపీగా ఎలా ఉన్నాడు?” అని ఆలోచనలో పడ్డాడు.
“క్లబ్ 99” రహస్యం
మరుసటి రోజు ఉదయం రాజు తన మంత్రిని పిలిచి ఆ విషయాన్ని అడిగాడు. అప్పుడు మంత్రి చిరునవ్వుతో చెప్పాడు. “రాజా… అతను ఇంకా క్లబ్ 99లో చేరలేదు.” రాజు ఆశ్చర్యపడి అడిగాడు “క్లబ్ 99 అంటే ఏమిటి?” మంత్రి బదులిస్తూ.. “ చెప్పడం కాదు రాజా మీకు చూపిస్తాను.” అంటూ రాజును వెంట తీసుకుని ఆ కార్మికుడి ఇంటికి వెళ్లాడు.
99 నాణేల ప్రభావం
ఆ కార్మికుడు రాత్రి పని చేసి అలసిపోయి ఇంట్లో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో మంత్రి, రాజుతో కలిసి అతని ఇంటి ముందు ఒక బంగారు నాణేల మూట వేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి కార్మికుడు లేచి ఆ మూటను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే నాణేలు లెక్కపెట్టడం ప్రారంభించాడు. మొత్తం 99 నాణేలు ఉన్నాయి. అప్పుడు అతని భార్య అనుమానంతో, “ఇవి 100 ఉండాలి… ఇంకో నాణెం ఎక్కడో ఉంది, వెతకండి” అని చెప్పింది. దాంతో అతను మళ్లీ మళ్లీ లెక్కపెట్టాడు… కానీ 100వ నాణెం దొరకలేదు. ఆ ఒక నాణెం కోసం అతను రోజంతా ఆలోచిస్తూ, వెతుకుతూ గడిపాడు. రాత్రి పని కూడా మానేశాడు… నిద్ర కూడా పోయింది.
క్లబ్ 99 పాఠం – నిజమైన సంతోషం
మరుసటి రోజు రాజు ఆ కార్మికుడిని దర్బార్‌కి పిలిపించాడు. ఇప్పటివరకు ఆనందంగా ఉన్న అతను ఇప్పుడు అలసిపోయి, ముఖం కాంతి కోల్పోయి కనిపించాడు. రాజు ఆశ్చర్యంతో మంత్రిని అడిగాడు. “ఇదేంటి? నిన్నటి వరకు హాయిగా ఉన్నాడు… ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయాడు?” మంత్రి సమాధానమిస్తూ.. “రాజా… ఇదే క్లబ్ 99. మనిషికి 99 ఉన్నా… లేని ఆ ఒక్కటి కోసం పరితపిస్తాడు. అదే అతని ఆనందాన్ని నాశనం చేస్తుంది. ఆ ఒక్కదాని కోసం ఆరోగ్యం, కుటుంబం అన్నీ కోల్పోతాడు.” అప్పుడు రాజుకు అసలు సత్యం అర్థమైంది. నీ దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండగలిగితేనే నిజమైన ఆనందం. లేకపోతే ఎంత ఉన్నా… మనసు ఎప్పటికీ తృప్తి చెందదు.

