నితిన్ తమ్ముడు మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందంటే?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ జూలై 4వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సెన్సార్ పూర్తి అయ్యింది.

నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈసినిమాలో కన్నడ నటి సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ నటి స్వస్తిక హీరోయిన్లుగా నటించారు. ఒకప్పుటి తెలుగు హీరోయిన్ లయ ఈసినిమా ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, చమ్మక్ చంద్ర, టెంపర్ వంశీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే .. మారుమూల అంబరగొడుగు గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. ఈ చిత్రంలో హీరో నితిన్ విలు విద్య క్రీడాకారుడిగా కనిపించనున్నారు. అలాగే, సీనియర్ నటి లయ ఆయన సోదరిగా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్, చైల్డ్ ఎమోషన్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఈసినిమా కథ కొనసాగుతుంది. ఒక రోజులో జరిగిన సంఘటన ఆధారంగా ఈసినిమా రూపొందినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీకి కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు పనిచేయగా, ఎడిటింగ్ బాధ్యతలు ప్రవీణ్ పుడి నిర్వర్తించారు. ఆర్ట్ వర్క్ జీఎం శేఖర్, యాక్షన్ కొరియోగ్రఫీని విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ అందించారు. దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు ఆడియన్స్ లో ఆసినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెంచాయి. ఈ సినిమాలో 5 యాక్షన్ ఎపిసోడ్స్ ఉండగా, మొత్తం సినిమా 80 శాతం ఫారెస్ట్ బాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కించారు. విజువల్స్, సౌండ్ డిజైన్, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
తాజాగా తమ్ముడు సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులకు ప్రివ్యూ షోలో ప్రదర్శించారు. సినిమా చూసిన అధికారులు కొన్ని సన్నివేశాలను కత్తిరిస్తే U/A సర్టిఫికెట్ ఇవ్వగలమని సూచించారు. కానీ దర్శక నిర్మాతలు ఈ సన్నివేశాలను తొలగించేందుకు నిరాకరించడంతో చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీచేశారు.
అయితే చిత్రం యూనిట్ స్పష్టంగా వెల్లడించిన ప్రకారం, ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ కానీ, అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏవీ లేవు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూసే చిత్రమేనని వారు స్పష్టం చేశారు. గతంలో దిల్ రాజు నిర్మించే సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే విధంగా ఉంటాయి.
ఇప్పటి వరకు ఈ బ్యానర్ నుంచి 50 సినిమాలు వస్తే.. గతంలో రామయ్య వస్తావయ్యా.. ఎవడు సినిమాలకు ఏ సర్టిఫికెట్స్ లభించాయి. ఇప్పుడు మళ్లీ ‘తమ్ముడు’ కూడా అదే రూట్‌లోకి చేరింది.ఈ సినిమాకు 145 నిమిషాల (2.25 గంటలు) రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.