రాజకీయాల్లోకి నటి మీనా, బీజేపీలో చేరబోతుందా, నిజమెంత?
90s లో హీరోయిన్ గా తెలుగు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసింది మీన. ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తున్న ఈ సెలబ్రిటీ స్టార్, త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంత.

ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది మీన. ప్రస్తుతం అప్పుడప్పుడు అలా వెండితెరపై మెరుస్తుంది. కాని రెగ్యూలర్ గా మాత్రం సినిమాలు చేయడంలేదు. అయితే తాజాగా మీనా రాజకీయ రంగ ప్రవేశం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. మీనా రీసెంట్ గా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతే కాదు మీనా పొలిటికల్ ఎంట్రీకీ పార్టీని కూడా సెలక్ట్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె త్వరలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరనున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంలో మీనా నుంచి కాని పార్టీ నుంచి కాని అఫీషియల్ గా ఎటువంటి సమాచారం లేదు. ఎవరు ఈ విషయాన్ని ధృవీకరించలేదు కూడా.
దాదాపు 45 ఏళ్లకు పైగా సినీ జీవితాన్ని కొనసాగిస్తున్న మీనా, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నటి. కాని ఆమె తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. తమిళ తెలుగు సినిమాలతో పాటు ఆమె మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లోనూ నటించి అక్కడి ఆడియన్స్ ను కూడా అలరించారు. నటించిన ప్రతీ భాషలో మీనా ప్రేక్షకాదరణ పొందారు. తన సినీ ప్రస్థానంలో ఆమె బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలెన్నో చేశారు.
మీన అన్ని భాషల్లోస్టార్ హీరోల సరసన ఆడిపాడారు. తెలుగులో ఆమె చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్ లాంటి స్టార్ హీరోలతో హిట్ సినిమాలు చేశారు. ఇక తమిళంలో ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, అజిత్, అర్జున్, శరత్ కుమార్, లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది.
కన్నడలో కూడా స్టార్ హీరోలతోనే ఎన్నో సినిమాలు చేసింది మీనా. ఆతరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో సినిమాలు కూడా తగ్గించింది. కాని తల్లి పాత్రలు మాత్రం చేయడంలేదు. దృశ్యం లాంటి సినిమాల్లో మెహన్ లాల్, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సరసన ఇప్పటికీ హీరోయిన్ గానే నటిస్తుంది మీన.
ఇక మీనా భర్త విద్యాసాగర్ 2022లో అనారోగ్య కారణాలతో మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మీనా తన కుమార్తె నైనికతో కలిసి ఉంటున్నారు. నైనిక చిన్నప్పుడే సినిమాల్లోకి ప్రవేశించింది. తమిళ స్టార్ హీరో విజయ్‌తో కలిసి తెరి (తెలుగులో ‘పోలీసోడు’) సినిమాలో ఆయన కూతురి పాత్రలో కనిపించింది.
ఇక మీనా రీసెంట్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి రావడంతో, రాజకీయ వర్గాల్లో మీనా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె బీజేపీలో చేరతారేమో అన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అంతే కాదు వచ్చే ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె పోటీ చేయనున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.
అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మీనా వైపు నుంచి గానీ, బీజేపీ వర్గాల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఎప్పటి నుంచో తమిళనాడులో పాగా వేయాలని పావులు కదుపుతోన్న బీజేపీ.. ఆ దిశగా అడుగుటు వేస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో కూడా మోడీ ముఖ్య అతిథిగా వచ్చిన ఓ కార్యక్రమంలో మీన పాల్గొంది. ఈరకంగా ప్రముఖ వ్యక్తులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూనే ఉంది బీజేపీ. ఇప్పటికే సౌత్ సీనియర్ హీరోయిన్ ఖుష్భూ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ బలపడేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే మీనాను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టిన ఊహాగానంగా మాత్రమే ఉంది. కానీ గతంలో సినీ తారలు రాజకీయాల్లోకి ప్రవేశించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మీనా భవిష్యత్తులో రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం మీనా ఉపరాష్ట్రపతితో భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉందా లేదా అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మీనా మాత్రం ఇప్పటి వరకు ఈ సమావేశం గురించి అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. . ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం అనేది కొత్త విషయం కాదు.
మీనా గతంలో కూడా పలుమార్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలతో సంబంధాలు ఏర్పడడం అసాధ్యమేమీ కాదు. కానీ ఆమె స్వయంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అనే విషయం మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.