Shubman Gill: డబుల్ సెంచరీ.. ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
Shubman Gill double century: ఎడ్జ్‌బాస్టన్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన తొలి టెస్ట్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియన్ కెప్టెన్‌గా నిలిచాడు.

Shubman Gill : డబుల్ సెంచరీ కొట్టిన శుభ్‌మన్ గిల్
Shubman Gill double century: భారత టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగల వరద పారిస్తున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో దుమ్మురేపే బ్యాటింగ్ తో చరిత్ర సృష్టించాడు.
తన కెప్టెన్సీలో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో లీడ్స్‌లో 147 పరుగులు అద్భుత సెంచరీ కొట్టిన గిల్.. ఇప్పుడు ఇంగ్లండ్‌లో రెండో టెస్ట్‌లో తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. 25 సంవత్సరాల వయస్సులో 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో అసాధారణ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంగ్లాండ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియన్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్
ఈ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో శుభ్‌మన్ గిల్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియన్ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
అలాగే, ఇంగ్లాండ్‌లో భారత కెప్టెన్‌గా అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా కూడా గిల్ ఘతన సాధించాడు. గతంలో మొహమ్మద్ అజహరుద్దీన్ 1990లో 179 పరుగులు చేసిన రికార్డును శుభ్‌మన్ గిల్ బద్దలు కొట్టలాడు.
డబుల్ సెంచరీ ప్లేయర్ల లిస్టులోకి శుభ్‌మన్ గిల్
శుభ్‌మన్ గిల్ టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన 26వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. 12 మంది భారత ఆటగాళ్లు ఒక్కో డబుల్ సెంచరీ సాధించగా, గిల్ 13వ వ్యక్తిగా ఈ జాబితాలో చేరాడు. మొత్తం 50వసారి భారత ఆటగాడు డబుల్ సెంచరీ చేసిన ఘట్టంగా ఇది నిలిచింది. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా టాప్ లో ఉన్నాడు.
కెప్టెన్సీలో డబుల్ సెంచరీ చేసిన ఐదవ భారత ప్లేయర్ శుభ్‌మన్ గిల్
కెప్టెన్సీ చేస్తూ టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టిన ఐదవ భారత ప్లేయర్ గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. గతంలో కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, సునీల్ గవాస్కర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఈ ఘనత సాధించారు.
అలాగే, టెస్ట్‌లు, వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన నాల్గవ భారత ఆటగాడిగా కూడా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, టెండూల్కర్, సెహ్వాగ్ లు ఉన్నారు.
అత్యంత నియంత్రితమైన సెంచరీ కొట్టిన గిల్
ఈ ఇన్నింగ్స్‌కి మరింత ప్రాధాన్యత ఇచ్చిన విషయం ఏమిటంటే, ఇది ఇంగ్లాండ్‌లో నమోదైన అత్యంత నియంత్రిత సెంచరీగా గుర్తింపును పొందింది. అంటే అత్యంత క్రమశిక్షణ, తక్కువ తప్పిదాలు, అధిక శాతం కంట్రోల్ షాట్స్ ఉన్న ఇన్నింగ్స్.
క్రిక్‌విజ్ గణాంకాల ప్రకారం, తొలి రోజు గిల్ 3.5 శాతం తప్పుడు షాట్లు మాత్రమే ఆడాడు. ఇంగ్లండ్‌లో సగటు తప్పుడు షాట్ శాతం 12గా ఉండగా, గిల్ చాలా తక్కువగా ఆడాడు. ఇది 2006లో డేటా సేకరణ మొదలైన తర్వాత ఇంగ్లండ్‌లో అత్యంత నియంత్రిత సెంచరీగా బీబీసీ పేర్కొంది.
ఇన్నింగ్స్‌లో కేవలం మూడు తప్పుడు షాట్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రెండు అవుట్‌సైడ్ ఎడ్జ్‌లు, బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో ఒక ఇన్‌సైడ్ ఎడ్జ్ మాత్రమే గిల్ ఆటలో కనిపించాయి. ఇది గిల్ టెక్నికల్ నైపుణ్యతకు నిదర్శనంగా నిలిచింది.
భారీ స్కోరు దిశగా భారత్
గిల్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో భారత్ 500+ పరుగుల మార్కును దాటింది. ఇండియా vs ఇంగ్లండ్ రెండో టెస్ట్ రెండవ రోజు రెండో సెషన్ ప్రారంభంలో భారత్ 129 ఓవర్లలో 510/6 పరుగులు చేసింది. మధ్యాహ్నం తర్వాత గిల్ తన సెంచరీని డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు.
రవీంద్ర జడేజా 89 పరుగుల వద్ద జోష్ టంగ్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో 203 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పడింది. అయితే తర్వాత గిల్, వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 50+ పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.
ఈ టెస్ట్ ఇన్నింగ్స్ ద్వారా గిల్ తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని మాత్రమే కాక, తన బ్యాటింగ్ స్థాయిని కూడా అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటిచెప్పాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై భారత ఆటగాళ్లు సాధించే అరుదైన ఇన్నింగ్స్ లలో ఇది ఒకటిగా నిలుస్తుంది.