Samsung : భారతీయులకు బంపరాఫర్... శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గేలా ఉన్నాయండోయ్..!
భారత్ లో శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గనున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకిలా ధరలు తగ్గే అవకాశాలున్నాయంటే…

ట్రంప్ సుంకాలతో భారత్ కు లాభమే...
Samsung : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఎన్నికల హామీ 'అమెరికా ఫస్ట్' పాలసీని అమలు చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. వివిధ దేశాలపై ఆయన విధిస్తున్న ప్రతీకార పన్నులు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలా భారత్ పై కూడా ట్రంప్ పన్నులు వేసేందుకు సిద్దమయ్యారు... కానీ మిగతా దేశాలతో పోలిస్తే ఇవి కాస్త తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇది ఇండియాకు బాగా కలిసివస్తోంది.
ఇప్పటికై చైనాపై అమెరికా అత్యధిక టారీఫ్స్ విధించడంతో దిగ్గజ అమెరికన్ మొబైల్ ఫోన్స్ కంపనీ యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో తమ ఉత్పత్తులను తగ్గించి భారత్ లో పెంచాలని నిర్ణయించింది.. ఇదే బాటలో ఇప్పుడు కొరియన్ కంపెనీ కూడా నడుస్తోంది.
ట్రంప్ సర్కార్ ఇప్పటికే వియత్నాంపై భారీ సుంకాలను విధించేందుకు సిద్దమయ్యింది... ఈ క్రమంలో అక్కడ ఉత్పత్తిని తగ్గించాలని ఈ దక్షిణ కొరియాకు చెందిన సెల్ ఫోన్ల తయారీ దిగ్గజం భావిస్తోంది. ఇదే సమయంలో భారత్ లో ఉత్పత్తిని పెంచాలని భావిస్తోంది.
భారత్ లో ఉత్పత్తి పెంచడంవల్ల శామ్సంగ్ కు లాభాలివే..
అమెరికా సుంకాల భారం తగ్గడమే కాదు భారత్ లో శామ్సంగ్ తమ ఉత్పత్తులను పెంచడంద్వారా ఇంకెన్నో లాభాలున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంటుంది... అలాగే అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలు ఇక్కడినుండి కార్యకలాపాలు సాగించేందుకు సిద్దమవుతున్నాయి.
భారతదేశంలో చీఫ్ లేబర్ తో పాటు తక్కువ ఖర్చుతోనే ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి. టెక్నాలజీ కూడా బాగా అందుబాటులో ఉంది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. కాబట్టి అమెరికా టారీఫ్స్ పెంచినా తగ్గిన ఉత్పత్తి ఖర్చు కలిసివచ్చే అవకాశాలున్నాయి. అందుకే యాపిల్ అయినా, ఇప్పుడు శామ్సంగ్ అయినా ఇండియాలో తమ ఉత్పత్తుల తయారీకి ఆసక్తి చూపిస్తున్నాయి.
భారత్ లో ఉత్పత్తి పెంచడంపై శామ్సంగ్ ఏమంటోంది?
ఇప్పటికే భారతదేశంలో శామ్సంగ్ కంపనీ వస్తువులు భారీగానే ఉత్పత్తి అవుతున్నాయి... ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో స్మార్ట్ ఫోన్ల తయారీ ఫ్యాక్టరీ ఉంది. అయితే ఇక్కడ ఉత్పత్తయ్యే ఫోన్లు కేవలం దేశీయ వినియోగానికే ఉపయోగిస్తున్నారు.
ఇక వియత్నాంలో తయారయ్యే ఉత్పత్తులను అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది శామ్సంగ్. కానీ ఇప్పుడు వియత్నాంలో ఉత్పత్తి తగ్గించి ఇండియాలో పెంచాలని... ఇక్కడినుండే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని నిర్ణయించినట్లు శామ్సంగ్ అధికారులు చెప్పకనే చెబుతున్నారు.
''శామ్సంగ్ ఉత్పత్తులు వివిద దేశాల్లో తయారవుతున్నాయి. అయితే ప్రస్తుతం అమెరికా నిర్ణయాలవల్ల ప్రపంచ వాణిజ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వీటిని మేము నిశితంగా గమనిస్తున్నాం. అమెరికాకు తమ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు వివిధ ప్యాక్టరీలను సిద్దం చేస్తున్నాం. ఇందులో ఇండియాలోని కంపనీలు కూడా ఉన్నాయి'' అని శామ్సంగ్ గ్లోబల్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వోన్ జూన్ చోయ్ వెల్లడించారు.
ఇక ఇండియా నుండే అమెరికాకు శామ్సంగ్ ఎగుమతులు...
ఇప్పటికే ఇండియాలో తయారయ్యే తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నట్లు చోయ్ వెల్లడించారు. ఇకపై ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని... భారత్ తమ ప్రధాన ఎగుమతిదారుగా మారవచ్చు అనేలా శామ్సంగ్ సిఓఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఇండియాలో శామ్సంగ్ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది.
శామ్సంగ్ ఫోన్ల ధరలు తగ్గుతాయా?
శామ్సంగ్ కంపెనీ ప్రధానంగా స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. అలాగే వివిధ రకాల ఎలక్ట్రానిక్ గృహోపకరణాలతో కూడా ఉత్పత్తి చేస్తుంది. కెమికల్స్, ఫైనాన్స్ రంగాల్లో కూడా ఉంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక సంస్థగా మారింది. భారతదేశంలో కూడా శామ్సంగ్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది.
అయితే తాజాగా శామ్సంగా తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయులకు మేలుచేసే అవకాశాలున్నాయి. ఈ దేశంలో ఉత్పత్తిని పెంచడం ద్వారా శామ్సంగ్ ధరలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా శామ్సంగ్ స్మార్ట్ ఫోన్లు ఉత్పత్తిని పెంచి అమెరికాకు ఎగుమతి చేయడంతో పాటు దేశీయంగా అమ్మకానికి పెట్టనుండి. ఈ దేశంలో తయారయ్యే వస్తువులకు సుంకాలు తక్కువగా ఉంటాయి... కాబట్టి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ట్రంప్ టారిప్స్ నిర్ణయం భారత్ కు కొన్ని విషయాల్లో మేలుచేసేలా ఉన్నాయి.