- Home
- Business
- Electric Vehicles: కారు ప్రియులకు గుడ్ న్యూస్: పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్
Electric Vehicles: కారు ప్రియులకు గుడ్ న్యూస్: పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్
Electric Vehicles: కార్లు ఇష్టపడే వారికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభ వార్త చెప్పారు. ఇకపై మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్రోల్ వాహనాల ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవచ్చు. ఇది ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసుకుందాం రండి.

ఎలక్ట్రిక్ కారు కొనాలంటే చాలా మంది భయపడే విషయం వాటి ధర. పెట్రోల్ కార్లకంటే వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది పెట్రోల్ వెహికల్స్ కొనడానికే ఇష్టపడతారు. అయితే ఇంధన వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది.
ఎంత ప్రోత్సాహం అందిస్తున్నా పెట్రోల్ వాహనాల ధరలతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. రూ.లక్షల్లో వాటి మధ్య తేడాలు ఉండటం, ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడంతో ఈవీల కొనుగోళ్లు తక్కువగానే జరుగుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ ప్రకటన చేశారు. 32వ కన్వర్జెన్స్ ఇండియా, 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పోలో గడ్కరీ ప్రసంగించారు.
మరో ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరకు సమానం అవుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. విదేశాల నుంచి దిగుమతులు తగ్గించి, దేశీయ కంపెనీలను, వాటి ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ధర తగ్గింపు గురించి గడ్కరీ గతంలో కూడా పలుమార్లు మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడటంతో త్వరలోనే ఈవీ ధరలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు భావిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఈవీల నిర్వహణ ఖర్చు తక్కువని గడ్కరీ అన్నారు. కిలోమీటరుకు కేవలం రూ.1 మాత్రమే ఖర్చవుతుందని ఆయన వివరించారు. పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి విక్రయించడం వల్ల ఎక్కువ మంది వీటిని కొంటారని, తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన ఎక్స్‌పోలో అన్నారు.