- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. దిగ్గజ టెక్ కంపెనీలతో చంద్రబాబు కీలక ఒప్పందం
Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. దిగ్గజ టెక్ కంపెనీలతో చంద్రబాబు కీలక ఒప్పందం
అమరావతి అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజధాని పునఃనిర్మాణ పనులకు నాంది పడగా. అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్‌కు కేంద్రంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కీలక ఒప్పందాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Amaravati
ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో దేశానికి మార్గదర్శిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని కేంద్రంగా మార్చుకుని 2026 జనవరి 1న క్వాంటమ్ కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో శుక్రవారం భారీ ఒప్పందాలకు నాంది పలికారు.
Chandrababu
ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక ఎంవోయూ (MoU) కుదుర్చుకుంది. దీనివల్ల దేశంలోనే తొలిసారిగా అమరావతిలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్’ నిర్మించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న IBM ‘క్వాంటమ్ సిస్టమ్ 2’, 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌తో కూడిన సూపర్ కంప్యూటర్, భారతదేశంలో తొలిసారి అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఒప్పందాల సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు – “1990లలో హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా మలిచిన విధంగా, ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ హబ్‌గా తీర్చిదిద్దడం మాకు లక్ష్యంగా ఉంది” అన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ వినియోగంతో వచ్చే కాలంలో పరిపాలన, పరిశోధన, అభివృద్ధి మారిపోయే అవకాశముందని అన్నారు. సిలికాన్ వ్యాలీ మాదిరిగానే, అమరావతిని‘క్వాంటమ్ వ్యాలీ’గా నిర్మించాలని ప్రముఖ ఐటీ సంస్థల ప్రతినిధులకు సూచించారు.
హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవంతో, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని కూడా అత్యల్ప సమయంలోనే నిర్మించగలమని సీఎం తెలిపారు. ఇప్పటికే L&Tకు స్థలాన్ని కేటాయించామని చెప్పారు. నిర్మాణ వేగాన్ని పర్యవేక్షించేందుకు రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు – ఒకటి నిర్మాణ పర్యవేక్షణకు, మరొకటి వ్యవస్థ అభివృద్ధి కోసం అని తెలిపారు.
ఐబీఎం, టీసీఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో భారతదేశంలో క్వాంటమ్ ప్రయాణం మరో మెట్టుపైకి వెళ్తుందని అన్నారు. ముఖ్యంగా హైబ్రిడ్ కంప్యూటింగ్ (క్వాంటమ్ + క్లాసికల్) ద్వారా బయోలాజీ, మెటీరియల్స్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అద్భుత ఫలితాల దిశగా ప్రయాణించవచ్చని వివరించారు.
టీసీఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. డిజిటల్ గవర్నెన్స్‌ను 2000ల్లో ఏపీతో ప్రారంభించిన తమ సంస్థ, ఇప్పుడు క్వాంటమ్ విప్లవానికి కూడా భాగస్వామిగా నిలవడం గర్వకారణంగా భావిస్తున్నట్టు తెలిపారు. COIN నెట్‌వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో 43 కేంద్రాలకు నేరుగా లబ్ధి చేకూరే అవకాశముందని వెల్లడించారు.