ఆంధ్రప్రదేశ్‌కి చెందిన యువ యూట్యూబర్ మధుమతి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర సంచలనంగా మారింది. చిన్న వయసులోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మధుమతి ఉన్నట్లుండి మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంతకీ ఏం జరిగిందింటే..
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22) ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లువెన్సర్‌గా, యూట్యూబ్ వేదికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించిన మధుమతి, యూట్యూబ్‌లోను భారీగా సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో ఆమెకు ప్రతాప్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అప్పటికే వివాహం జరిగిన ప్రతాప్‌తో మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారిందని, క్రమేణా ఇది వివాహేతర సంబంధానికి దారి తీసిందని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే మధుమతి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి, అక్కడే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధుమతి ఆత్మహత్యకు ప్రతాప్ కారణమని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసు స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి స్థాయిలో నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
