Mukesh Ambani: ముఖేష్ అంబానీ జియో-బ్లాక్‌రాక్ భాగస్వామ్యం భారత పెట్టుబడి రంగాన్ని డిజిటల్ మార్గంలో మార్చే లక్ష్యంతో రూ.150 మిలియన్‌ పెట్టుబడితో జాయింట్ వెంచర్ ను ప్రకటించాయి.

Jio Financial and BlackRock: ప్రపంచంలో అతిపెద్ద ఆస్తుల నిర్వహణ సంస్థ అయిన బ్లాక్‌రాక్ (BlackRock), ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (Jio Financial Services Limited-JFS) భారతదేశంలో రూ.54 లక్షల కోట్ల విలువ కలిగిన ఆస్తుల నిర్వహణ రంగంలో మరో విప్లవానికి నాంది పలుకుతూ బలమైన భాగస్వామ్యంలోకి ప్రవేశించాయి.

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్-బ్లాక్‌రాక్ జాయింట్ వెంచర్‌

ఈ రెండు సంస్థలు “జియో బ్లాక్‌రాక్” (Jio BlackRock) అనే 50:50 వాటాలు కలిగిన జాయింట్ వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ భాగస్వామ్యం భారతదేశంలోని కోట్లాది పెట్టుబడిదారులకు సులభమైన, సరసమైన, వినూత్న పెట్టుబడి ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకంగా పట్టణేతర ప్రాంతాల్లో ఉన్న కొత్తగా మొదటిసారి పెట్టుబడులు పెట్టే వారిని టార్గెట్ చేస్తూ బలమైన మార్కట్ ను విస్తరించాలని చూస్తోంది.

బ్లాక్‌రాక్ తన అంతర్జాతీయ పెట్టుబడి నైపుణ్యం, మౌలిక వనరులు, రిస్క్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, గ్లోబల్ స్కేలు వంటి అంశాలతో ఈ జాయింట్ వెంచర్‌లో కీలక పాత్ర పోషించనుంది. మరోవైపు, జేఎఫ్ ఎస్ భారత మార్కెట్‌పై లోతైన అవగాహనతో, డిజిటల్ మౌలిక సదుపాయాలతో, వినూత్న అమలు సామర్థ్యంతో సహకరించనుంది.

జియోలా విప్లవం తీసుకువస్తుందా? 

ఈ కొత్త సంస్థ ప్రారంభ కార్యకలాపాలను నిబంధనల అనుమతుల తర్వాత ప్రారంభించనుంది. సంస్థకు ప్రత్యేక మేనేజ్‌మెంట్ టీమ్ ఉండనుంది. ఇరువురు సంస్థలు ఈ జాయింట్ వెంచర్‌లో మొదటగా ఒక్కో సంస్థగా US$150 మిలియన్ (సుమారు ₹1235 కోట్ల రూపాయలు) చొప్పున పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించాయి. దీనికి సెబీ అమోదం కూడా లభించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఈ భాగస్వామ్యంపై బ్లాక్‌రాక్ ఏపీఏసీ చైర్‌పర్సన్, హెడ్ రాచెల్ లార్డ్ మాట్లాడుతూ.. “భారతదేశం పెట్టుబడి రంగంలో అపారమైన అవకాశాలను కలిగి ఉంది. సామర్థ్యవంతమైన డిజిటల్ పరివర్తనతో, పెరుగుతున్న సంపదతో ఇది అత్యంత ఉత్కంఠభరితమైన మార్పు దశలో ఉంది. జియోతో కలిసి ఈ విప్లవాత్మక మార్పులో భాగమవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం” అని తెలిపారు.

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అధ్యక్షుడు, సీఈఓ హితేష్ సేథియా మాట్లాడుతూ.. “బ్లాక్‌రాక్‌తో భాగస్వామ్యం ప్రపంచ స్థాయి పెట్టుబడి నైపుణ్యాన్ని డిజిటల్ సామర్థ్యంతో కలిపి దేశ ప్రజల వద్దకు తీసుకెళ్లే దిశగా పెద్ద అడుగు. ఇది వినియోగదారుల అవసరాలను ప్రథమంగా ఉంచే, డిజిటల్-ఫస్ట్ దృష్టితో పనిచేసే మార్గదర్శక సంస్థ అవుతుంది” అని పేర్కొన్నారు.

పెట్టుబడి ఉత్పత్తుల పంపిణీ విధానాల్లో విప్లవాత్మక మార్పులు

కాగా, ఈ భాగస్వామ్యం ద్వారా మ్యూచువల్ ఫండ్లు, ఏఎంసీలు, పెట్టుబడి ఉత్పత్తుల పంపిణీ విధానాల్లో విప్లవాత్మక మార్పులు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డిజిటల్ ఆధారిత పంపిణీ, తక్కువ ఖర్చుతో పెట్టుబడి పథకాలు, పట్టణాల నుండి గ్రామాల వరకు లోతైన విస్తరణ వంటి అంశాలు దీని ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. జియో బ్లాక్‌రాక్ భారతదేశ పెట్టుబడి రంగంలో జియో టెలికాం లాగా మరో మరో విప్లవం తీసుకువచ్చే అవకాశాలున్నాయి.