అమరావతిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా రోడ్ షో, బహిరంగ సభ, అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది.? ఎంత మంది హాజరుకానున్నారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారీ సభా ప్రాంగణం:
250 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం వెనుక భాగంలో సుమారు 250 ఎకరాల్లో సభా ప్రాంగణాం సిద్ధం చేశారు. మరో 100 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. సభలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.
ప్రధాన వేదికపై 20 మంది నేతలు ఉంటారు. వీవీఐపీ వేదికపై 100 మంది, మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు సుమారు 5 నుంచి 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 5 నుంచి 10 వేల మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు:
రవాణా, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 11 మార్గాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు, 7000 బస్సులు, 3000 కార్లు పార్కింగ్ చేసేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఎస్పీజీ పర్యవేక్షణలో హెలిప్యాడ్:
ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఏపీ సచివాలం వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లును ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. మహిళా రైతులు ప్రధానికి పూలతో స్వాగతం పలకాలని ముందుగా నిర్ణయించారు. అయితే కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత జరరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని సూచించాయి.
మోదీ టూర్ ఇలా ఉండనుంది.
* మే2వ తేదీ మధ్యాహ్నం 2.50 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
* మధ్యాహ్నం 3:10 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు.
* మధ్యాహ్నం 3.25 గంటలకు సభా ప్రాంగాణానికి చేరుకొని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
* సాయంత్రం 4:45 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం చేరుకొని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
ట్రాఫిక్ ఆంక్షలు:
మోదీ పర్యటన నేపథ్యంలో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మే 2న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు.
* చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు విజయవాడ మీదుగా కాకుండా ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు కూడా ఇదే దారిలో వెళ్తాయి.
* చిలకలూరిపేట నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఎన్‌హెచ్-16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ గుండా వెళ్లాలి.
* చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు బోయపాలెం క్రాస్ నుంచి ఉన్నవ, ఏబీపాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
* గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు బుడంపాడు క్రాస్ నుంచి తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
* గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఆగిరిపల్లి, శోభనాపురం, గణపవరం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్తాయి.
* అలాగే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాలి.
* హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు కూడా ఇదే దారిలో వెళ్లాలని అధికారులు సూచించారు.
