అమ‌రావ‌తి పునఃనిర్మాణ కార్య‌క్ర‌మంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి నిర్మాణాన్ని అడ్డుకున్న వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేసిన అమ‌రావ‌తిని ఎవ‌రూ ఆప‌లేరంటూ నారా లోకేష్ పున‌రుద్ఘ‌టించారు.  

అమ‌రావ‌తి పునఃనిర్మాణ కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి న‌మో న‌మః అంటూ త‌న స్పీచ్‌ను మొద‌లు పెట్టారు. గతంలో వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారన్నారు. చంద్ర‌బాబుపై ఉన్న అక్క‌సుతో అమ‌రావ‌తిని వైసీపీ అడ్డుకుంద‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్న లోకేష్ జై అమరావతి అన్నందుకు గతంలో తిరగలేని పరిస్థితి ఉంద‌ద‌ని గుర్తు చేశారు. 

మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదన్నారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు లోకేష్‌. ప్ర‌ధాని మోదీ ఒక మిస్సైల్ అని అన్నారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులు తెలిపారు లోకేష్‌. 

ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని భ‌రోసా ఇచ్చారు. పాకిస్థాన్‌కు సమాధానం చెప్పగలిగే మిస్సైల్‌ ప్రధాని మోదీ అని అన్నారు. ఒక్క పాకిస్థాన్‌ కాదు.. వంద పాకిస్థాన్‌లు వచ్చినా ఏం చేయలేవన్నారు. మోదీ కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌ తోకముడవటం ఖాయమ‌ని చెప్పుకొచ్చారు.