Farmer compensation: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు మంగళవారం పరిహారం అందిస్తామనీ, ధాన్యం కొనుగోలు విషయంలో ఆలస్యం జరగకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
CM Chandrababu orders compensation for farmers: రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతుకు మంగళవారం సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే, పిడుగుపాటుతో మృతిచెందిన 8 మంది బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. పంట నష్టాలు, ప్రాణ నష్టాల వివరాలు సీఎంకు అందించారు.
రైతులను ముంచిన అకాల వర్షాలు
అధికారుల ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,224 హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో పశ్చిమ గోదావరి జిల్లాలో 1,033 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 641 హెక్టార్లు, కాకినాడ జిల్లాలో 530 హెక్టార్లు, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో పంటనష్టం జరిగింది.
అలాగే, 138 హెక్టార్లలో ఉద్యాన పంటల నష్టం జరిగింది. ముఖ్యంగా అరటి, మామిడి, బొప్పాయి పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ నష్టం నమోదైంది.
ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు
రబీ సీజన్‌లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు. ఇప్పటివరకు 13 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. వర్షాలకు రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎంకు తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమంలోనే అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. "రైతుల వద్ద ఉన్న ధాన్యం పూర్తిగా కొనాలి. ధాన్యం కొనలేదు అన్న మాట ఎక్కడ వినిపించకూడదు. అవసరమైతే కేంద్రంతో చర్చించి మరిన్ని కొనుగోళ్లు జరపాలి" అని తెలిపారు.
విపత్తులపై అప్రమత్తంగా ఉండండి : చంద్రబాబు
విపత్తుల సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని, ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు ఇవ్వాలన్నారు. సెల్ ఫోన్లకు సందేశాలు వెళ్ళని సందర్భాల్లో నేరుగా వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. పిడుగుపాట్లతో చనిపోయిన పశువులకు కూడా తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు.
విద్యుత్ శాఖకు సీఎం చంద్రబాబు అభినందనలు
వర్షాలతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న జిల్లాల్లో, అత్యంత వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టిన విద్యుత్ శాఖ సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. చివరగా, సీఎం చంద్రబాబు కలెక్టర్లు తక్షణ చర్యలతో పాటు మున్ముందు కూడా విపత్తులలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెక్నాలజీ, మానవ శక్తిని సమర్థవంతంగా వినియోగించి నష్టం నివారించాలన్నారు.
