ఏపీ సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలను జూన్ 10 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డేటా మార్పిడి కారణంగా పది ముఖ్యమైన సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందే ముఖ్యమైన ఆన్‌లైన్ (Online Services) సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడుతున్నాయి. జూన్ 7 శనివారం నుంచి ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ సేవల నిలిపివేత జూన్ 10వ తేదీ మంగళవారం రాత్రివరకు కొనసాగనుంది. ఈ విషయాన్ని సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ అధికారికంగా ప్రకటించారు.

డేటా మార్పిడి కారణంగా…

ఇది శాశ్వతం కాదు. డేటా మార్పిడి కారణంగా తాత్కాలికంగా తీసుకున్న చర్య మాత్రమేనని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏపీ సేవ పోర్టల్‌ను మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్‌కు తరలించబడుతోంది. ఈ టెక్నికల్ ప్రక్రియ జరిగే వరకు కొన్ని ముఖ్యమైన సేవలను నిలిపివేస్తున్నట్టు సమాచారం.

ఈ నాలుగు రోజుల కాలంలో రేషన్, రైస్ కార్డులు, ఆదాయ ధ్రువీకరణ, వృద్ధాప్య పింఛన్, వివాహ ధ్రువీకరణ, నివాస స్థలం ధ్రువీకరణ, రెవెన్యూ వాటర్ ట్యాక్స్, మ్యూటేషన్, పట్టణ పరిపాలన సేవలు లాంటి పది కీలక సేవలకు అంతరాయం ఏర్పడుతుంది.

మీ సేవా కేంద్రాల్లో…

ఇది మిగతా సేవలన్నింటికీ వర్తించదు. ఆధార్ అప్‌డేట్, బ్యాంకింగ్, కేంద్ర, రాష్ట్ర పథకాలకు సంబంధించిన సేవలు, ఇతర నాన్-రెవెన్యూ సేవలు మీసేవా కేంద్రాల్లో యథావిధిగా అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

ప్రజలు ఈ తాత్కాలిక అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. సేవలు త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://ap.gov.in/ ను సందర్శించవచ్చని తెలిపారు.