Andhra Minister Savitha : ఏపీ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కార్యక్రమంలో మంత్రి సవిత పుష్పగుచ్చంను విసిరికొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sanjeevareddygari Savitha: ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవితకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి తీరును చూసి అందరూ షాక్ అయ్యారు. సవిత నడుచుకున్న తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక మంత్రి అయివుండి ఇలా నడుచుకోవడమేంటని విమర్శిస్తున్నారు. ఏం జరిగిందంటే..?

మంత్రి సవితకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిలో ఆమె ఓ జిల్లా అధికారిపై అసహనం వ్యక్తం చేస్తూ ఇచ్చిన పుష్పగుచ్ఛాన్ని విసిరేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఫ్లవర్ బోకే ఇవ్వగానే మంత్రి దానిని తీసుకుని విసిరికొట్టారు.

ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకుంది. మంత్రి సవితా తన నియోజకవర్గంలో మొదటి దశలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై వివరాలు అడిగారు. ఆ కార్యక్రమంలో ఉన్న తహసీల్దార్‌ ను మంత్రి ప్రశ్నించారు. అయితే, ఆ అధికారికి సరైన సమాచారం లేకపోవడంతో సమాధానం ఇవ్వలేకపోయారు.

దీంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి సవితా, ఆమెకు అప్పుడే ఇచ్చిన బొకేను చేతిలో పట్టుకుని బహిరంగంగా విసిరేశారు. ఈ దృశ్యం సభలో పాల్గొన్న పలువురిని ఆశ్చర్యంతో పాటు షాక్ కు గురిచేసింది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో మంత్రి సవిత పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం నైతికతకూ, పదవికి తగదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

View post on Instagram

అంతేకాకుండా, అధికారులకు మర్యాద చూపడం నాయకుల బాధ్యత అని కొందరు పేర్కొంటూ, ఈ తరహా ప్రవర్తన వల్ల ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందనీ, భిన్న అభిప్రాయాలు ఏర్పడతాయని విమర్శిస్తున్నారు.

ఇక అధికార వర్గాల నుంచి దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఘటనపై ఆ అధికారికి సంబంధించి పై స్థాయి విచారణ జరుగుతుందా లేదా అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే వీడియోపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండటంతో మంత్రివర్గంలో చర్చకు రావచ్చని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.