మేనెల మొదట్లోనే మురిపించిన రుతుపవనాలు..ఇప్పుడు కనీసం పలకరించడం లేదు.దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేడి ,ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో వారం రోజులు ఈ తిప్పలు తప్పవని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Weather: ఆంధ్రప్రదేశ్ వాతావరణం (Andhra Pradesh)మరోసారి తారుమారైంది. మే నెలలో సాధారణం కంటే తొందరగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కొద్దిరోజుల క్రితం విస్తృతంగా వర్షాలు కురిశాయి. అయితే ప్రస్తుతం ఆ రుతుపవనాలు ఏటో వెళ్లిపోయాయి. దీంతో ఎండలు తిరిగి మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి.

గరిష్ఠంగా 41 డిగ్రీల వరకు..

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోత తీవ్రంగా కనిపిస్తోంది. అక్కడ గరిష్ఠంగా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

కొన్ని జిల్లాల్లో మాత్రం వానలు..

వాతావరణ మార్పుల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు పడుతున్నాయి. గురువారం గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇదే విధంగా రాబోయే వారం రోజులపాటు రాష్ట్రంలో తేమ, వేడి మిశ్రమంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా తెలియజేశారు.

తొమ్మిది రోజుల ముందుగానే..

మే 26న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తొమ్మిది రోజుల ముందుగానే వచ్చాయని ఐఎంఎస్ అధికారులు చెప్పారు. కానీ ప్రస్తుతం అవి బలహీనంగా మారిన కారణంగా వర్షాలు తగ్గి, ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయని పేర్కొన్నారు.ఇక జూన్ 11న బంగాళాఖాతంలో కొత్త వాతావరణ వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనివల్ల జూన్ 12 నుంచి రుతుపవనాలు బలపడే అవకాశం ఉందని చెప్పింది.

రెండు నుంచి మూడు డిగ్రీల వరకు..

రాబోయే నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. నందిగామ, తుని, విశాఖపట్నం, నెల్లూరు, మచిలీపట్నం, గన్నవరం వంటి నగరాల్లో భగ్గుమనే వాతావరణం కొనసాగనుంది.

రాష్ట్రంలో మొత్తం వర్షపాతంలో 60 శాతం భాగం నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో వచ్చే వర్షాలే రిజర్వాయర్లు, చెక్ డ్యామ్‌లను నింపుతాయి. ముఖ్యంగా వ్యవసాయంలో నైరుతి వర్షాలు కీలకంగా వ్యవహరిస్తాయి.