ఇప్ప‌టికే ఫార్ములా వ‌న్ కేసు, క‌విత ఎపిసోడ్‌తో ఇబ్బందులు ప‌డుతోన్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మ‌రో స‌మ‌స్య వ‌చ్చింది. సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంత‌కీ సుప్రీం నోటీసులు జారీ చేయ‌డానికి అస‌లు కార‌ణం ఏంటంటే..

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) కు భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానమైన సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన భారీ అవినీతి ఆరోపణల కేసులో భాగంగా జారీ అయ్యాయి.

అస‌లేం జ‌రిగిందంటే.?

మూసీ నది శుద్ధి పేరుతో రూ.25,000 కోట్ల అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందని కేటీఆర్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఆధారంగా పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.

హైకోర్టును ఆశ్ర‌యించిన కేటీఆర్‌

కేసు రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుతో అసంతృప్తిగా ఉన్న ఆత్రం సుగుణ, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సుప్రీం కోర్టు స్పందన

ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో కేటీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మ‌రి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.