Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

BRS MLA Maganti Gopinath: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హృదయ సంబంధిత తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పలువురు బీఆర్ఎస్ నాయకులు కలిశారు.

మాగంటి గోపీనాథ్ కు వయసు 62 సంవత్సరాలు. ఆయన తన నివాసంలో ఉన్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

మాగంటి గోపీనాథ్ గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని నెలల క్రితం ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగిందని సమాచారం. ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుందనుకున్న సమయంలో అకస్మాత్తుగా హృదయ సంబంధిత సమస్య తలెత్తి పరిస్థితి విషమంగా మారింది.

గురువారం మధ్యాహ్నం ఆయన గుండె సమస్యలు తీవ్రం కావడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు, అనుచరులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోపీనాథ్ నివాసం వద్ద కూడా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై హైదరాబాద్ వైద్యులు త్వరలోనే మరో ప్రకటన చేయనున్నారు.

మాగంటి రాజకీయ జీవిత ప్రస్థానం ఇది

మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీలో ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రభావంతో 1980లలో రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 1992 వరకు టీడీపీ యువజన విభాగం 'తెలుగు యువత' అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తరువాత బీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018, 2023లో వరుసగా రెండుసార్లు మళ్లీ ఎన్నికయ్యారు.

మాగంటి గోపీనాథ్ సినిమారంగంతోనూ సమీప సంబంధాలను కలిగి ఉన్నారు. టాలీవుడ్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు కూడా సోషల్ మీడియా ద్వారా త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.