Charminar:  'చార్మినార్‌లో మళ్లీ నమాజ్‌ చేసేందుకు అనుమతి' అంటూ స్థానిక కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కార్యదర్శి రషీద్ ఖాన్ ప్ర‌చారం ప్రారంభించారు. అదే సమయంలో హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించేందుకు  కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు అన్నారు. 

Charminar:  కుతుబ్ మినార్ తర్వాత ఇప్పుడు చార్మినార్ వివాదం తెరపైకి వస్తోంది. 16వ శతాబ్దపు కట్టడమైన చార్మినార్ పైభాగంలో ఉన్న మసీదులో మళ్లీ ప్రార్థనలు చేసేందుకు కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు, కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కార్యదర్శి రషీద్ ఖాన్ సంతకాల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రార్థనల కోసం స్థలాన్ని తెరవడానికి అనుమతించాలని రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. 

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా చార్మినార్‌లో ప్రార్థనలు చేసుకోవ‌డానికి అనుమ‌తించాలని రషీద్ ఖాన్ కోరాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తి చార్మినార్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనీ, అప్పటి నుంచి మసీదులో నమాజ్ చేయడంపై నిషేధం విధించారు.
సుమారు 200 ఏళ్ల క్రితం ఈ ప్రదేశంలో ముస్లింలు నమాజ్ చేయడానికి నిలిపివేశార‌ని తెలిపారు. 

కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురాతత్వ పరిశోధన విభాగాన్ని (ఏఎస్ఐ) కూడా ర‌షీద్ ఖాన్ ఇదే కోరారు. తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడగా.. శాంతి భద్రతల సమస్యను ఆయన ప్రస్తావించినట్టు చెప్పారు. అందరి సంతకాలు తీసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దకు వెళతాననీ, త‌మ‌ వినతిని పరిష్కరించకుంటే ప్రగతి భవన్‌ వద్ద ఆందోళనకు దిగుతాన‌ని పేర్కొన్నారు. 

భాగ్యలక్ష్మి దేవాలయంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు 

చార్మినార్ ను ఆనుకునే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంపైనా ర‌షీద్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. RTI నివేదికల ప్రకారం.. అవి అనధికార, ఆక్రమణ, అక్రమ నిర్మాణమ‌ని పేర్కొన్నారు. తాము గంగా జమునా తెహజీబ్‌ను నమ్ముతామనీ, ఆలయంలో ప్రార్థనలకు అనుమతించినప్పుడు.. చార్మినార్ ను సైతం ముస్లింల ప్రార్థనలకు అనుమతించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అదే సమయంలో, కాంగ్రెస్ నాయకుడి సంతకాల ప్రచారంపై బిజెపి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హైదరాబాద్ లో మత కలహాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు అన్నారు. నగరంలో కాంగ్రెస్ పార్టీ పతనమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని మతపరమైన అంశాలను లేవనెత్తి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

చార్మినార్ సమీపంలోని దేవాలయం, మసీదుపై అనుచిత వ్యాఖ్య‌లు చేసి.. పాత నగరంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నమని, దానిని తీవ్ర‌ నేరంగా పరిగ‌ణించాల‌ని మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి, నగరంలో మతకల్లోలం సృష్టించినందుకు అతడిని అరెస్టు చేయాలని, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు తమ ప్రయోజనాల కోసం మైనార్టీల మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ఆలయం-మసీదు వివాదం నెలకొన్న నేపథ్యంలో చార్మినార్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుండడం గమనార్హం.