ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఇప్పటికే నిలిచిపోయింది. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దీన్ని తాత్కాలికంగా నిలిపివేసారా? లేక పూర్తిగా ఈ ఏడాది ఐపిఎల్ లేనట్లేనా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై బిసిసిఐ మాజీ ఛైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
India Pakistan War : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఐపీఎల్ 2025 నిలిపివేయడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఐపిఎల్ ను నిలిపివేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఈ ఐపీఎల్ 2025 మిగిలిన భాగాన్ని ఒక వారం పాటు నిలిపివేయాలని నిర్ణయించింది.
"దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఐపిఎల్ లో చాలా మంది భారతీయ, విదేశీ ఆటగాళ్ళు ఆడుతున్నారు. ఆటగాళ్లతో పాటు అభిమానుల భద్రతను పరిగణలోకి తీసుకుని బిసిసిఐ పిఎల్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ టోర్నమెంట్ ప్రస్తుతం కీలక దశలో ఉంది.. కాబట్టి త్వరలోనే పునఃప్రారంభమవుతుందని ఆశిద్దాం" అని సౌరవ్ గంగూలీ ఎఎన్ఐ కి చెప్పారు
. "ముఖ్యంగా ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, జైపూర్ వంటి చోట్ల ఉద్రిక్తతల నేపథ్యంలో బిసిసిఐ ఐపిఎల్ వాయిదా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాలన్నింటిలో ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఐపిఎల్ వాయిదా చేయక తప్పలేదు. కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిద్దాం. బిసిసిఐ ఈ ఐపీఎల్ 2025 ని పూర్తి చేస్తుందని ఆశిద్దాం. భారత్ ముందు పాకిస్తాన్ ఎక్కువకాలం నిలవలేదు... కాబట్టి త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడి ఐపిఎల్ తిరిగి ప్రారంభంఅవుతుంది'' అని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేసారు.
ఆపరేషసన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ భారత్ పై మిస్సైల్స్, డ్రోన్లతో దాడిచేసింది. ఈ క్రమంలోనే ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను అర్ధాంతరంగా నిలిపివేసారు. మ్యాచ్ రద్దు గురించి ప్రకటించి ఆటగాళ్లను, అభిమానులను మైదానం నుండి ఖాళీ చేయించారు. రెండు జట్లను వారి హోటల్‌కి తిరిగి తీసుకెళ్లారు.
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) సభ్యుడు సంజయ్ శర్మ ANIతో మాట్లాడుతూ... "భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కారణంగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలోనే రద్దు చేయబడింది" అని అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) క్రీడాకారులను, మరియు మొత్తం ప్రసార బృందాన్ని ధర్మశాల నుండి ఢిల్లీకి తరలించడానికి బిసిసిఐ ప్రత్యేక వందే భారత్ రైలును ఏర్పాటు చేసింది.
