విక్టరీ డే వేడుకల్లో పాల్గొనడానికి మోడీ రష్యా వెళ్లట్లేదు. క్రెమ్లిన్ ప్రతినిధి దీన్ని ధృవీకరించారు. అయితే అధికారిక కారణం ఇంకా తెలియరాలేదు.
విక్టరీ డే వేడుకలు: మే 9న రష్యా రాజధాని మాస్కోలో విక్టరీ డే వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రపంచ నాయకులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించారు. అయితే, మోడీ ఈ వేడుకల్లో పాల్గొనట్లేదు.
బుధవారం నాడు క్రెమ్లిన్ ప్రతినిధి రాయిటర్స్ వార్తా సంస్థకు మోడీ విక్టరీ డే వేడుకల్లో పాల్గొనట్లేదని తెలిపారు. అయితే, ప్రధాని ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని రష్యా అధికారులు వెల్లడించలేదు. కానీ, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మోడీ రష్యా వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై భారత్ ఇంకా స్పందించలేదు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా పర్యటన
రష్యా ఏటా మే 9న రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విజయాన్ని విక్టరీ డేగా జరుపుకుంటుంది. ఈ ఏడాది 80వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సహా పలువురు అంతర్జాతీయ నాయకులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిన్‌పింగ్ రష్యా వెళ్లనున్నారు.
మే 9న మాస్కోలో జరగనున్న విక్టరీ డే వేడుకల్లో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి మోడీకి ఆహ్వానం అందిందని ఈ నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. భారత్ నుంచి ఎవరు హాజరవుతారనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విక్టరీ డే పరేడ్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించవచ్చని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ భారత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. ఆ సమయంలో మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. దాడి తర్వాత ఆయన తన పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చారు.
