ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల అంతానికి భారత్ స్పందిస్తే పాకిస్థాన్ మాత్రం వంకర బుద్ధిని చూపింది. సామాన్యులపై దాడికి దిగింది పాక్ ఆర్మీ.
జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఆర్మీ తీవ్ర షెల్లింగ్ (బాంబుల దాడి) చేపట్టింది. పాకిస్థాన్ ఆర్మీ చేసిన దాడుల్లో పలువురు సామాన్య ప్రజలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌పై ఎలాంటి ప్రతి దాడి చేయొద్దని అమెరికా ఇప్పటికే పాక్‌ను హెచ్చరించినా.. పాకిస్థాన్ మాత్రం తన వంకర బుద్ధిని చూపిస్తోంది.
పూంఛ్‌లోని కృష్ణాఘాటి, షాపూర్, మన్కోట్ ప్రాంతాలతో పాటు రాజౌరిలో లామ్, మంజాకోట్, గంభీర్ బ్రహ్మణా, కుప్వారాలో కర్ణా ప్రాంతాల్లో పాక్ వైపు నుంచి షెల్ దాడి జరిగింది. భారత సైన్యం దాడులు చేసిన వెంటనే పాకిస్థాన్ ఈ చర్యలను ప్రారంభించింది. అయితే భారత సైన్యం కూడా తక్షణమే ప్రతిస్పందనగా కాల్పులకు దిగింది. ఈ క్రాస్ బోర్డర్ కాల్పులు కొనసాగుతుండగా, స్థానిక ప్రజలు భయంతో అండర్గ్రౌండ్ బంకర్లకు వెళ్లిపోతున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. దానికి ప్రతీకారంగా భారత్ "ఆపరేషన్ సింధూర్" పేరుతో బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలపై క్షిపణుల దాడులు చేసింది. ఇందులో బహావల్పూర్ (జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ ప్రధాన కేంద్రం ఉన్న ప్రదేశం) సహా మొత్తం తొమ్మిది టార్గెట్లు ఉన్నాయని తెలుస్తోంది.
భారత ఆర్మీ అధికారికంగా తెలుపుతూ, “భారత్‌కు వ్యతిరేకంగా దాడులు జరగే ఉగ్రవాద స్థావరాలపై ఉక్కుపాదం మోపాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం” అని తెలిపింది. అదే సమయంలో పూంఛ్ - రాజౌరిలోని భిమ్‌బెర్ గాలీ ప్రాంతంలో పాక్ మళ్లీ భారీ ఆర్టిలరీ దాడులకు పాల్పడిందని భారత సైన్యం వెల్లడించింది. దీనికి గాను తగిన విధంగా జవాబు ఇస్తున్నామని ADGPI ట్విట్టర్‌లో పేర్కొంది.
2021 ఫిబ్రవరి 25న భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అయిన తర్వాత ఇటువంటి భారీ కాల్పులు అరుదుగా మాత్రమే జరిగాయి. అయితే ఇటీవల, భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రిటీని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన కొన్ని గంటలకే పాక్ కాల్పులకు పాల్పడడం ప్రారంభించింది.
