భారత్ మెరుపుదాడులకు సంబంధించి పాకిస్థాన్ స్పందించింది. పాక్ సైన్యాధికారితో పాటు ప్రధాని సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. ప్రధాని మరికాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
భారత్ మెరుపుదాడులకు సంబంధించి పాకిస్థాన్ స్పందించింది. పాకిస్థాన్ సైన్యపు అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ మాట్లాడుతూ, భారత దళాలు మురీద్కే, కోట్‌లి, బహావల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో టార్గెట్ దాడులు నిర్వహించాయని చెప్పారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారని, మరో 12 మందికి గాయాలైనట్లు తెలిపారు. సమయానికి తగిన జవాబు ఇచ్చే అవకాశం తమకు ఉందని, తాత్కాలిక విజయానికి భారతదేశం మురిసిపోతే, అది శాశ్వత నష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు.
ఇక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందిస్తూ, "భారతదేశం మోసపూరితంగా పాకిస్థాన్‌లోని ఐదు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. ఈ చర్యలు యుద్ధానికి సమానమైనవే. పాకిస్థాన్ తగిన సమాధానం తప్పక ఇస్తుంది. దేశం మొత్తం సైన్యం వెనుక నిలిచింది. శత్రువు కుట్రలు విఫలమవడం ఖాయం" అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఈ ప్రకటన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు దిగగా, భారత దళాలు కూడా ప్రతికర్యగా కాల్పులు జరిపాయి. దీంతో ఎల్‌వోసీ ప్రాంతం చుట్టుపక్కల వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
భారత దాడులు జరిగిన వెంటనే పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలను 48 గంటలపాటు మూసివేసింది. ఈ దాడుల అనంతరం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడి పూర్తి వివరాలను అందించినట్టు సమాచారం.
‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా జరిగిన తర్వాత, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు ‘భారత మాతా కీ జై’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు హై అలర్ట్‌కి వెళ్లాయి. పాక్ నుంచి ఏదైనా కౌంటర్ చర్య ఎదురైనా తక్షణమే స్పందించేందుకు ఎల్‌వోసీ ప్రాంతంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. బుధవారం ఉదయం 10:30కు పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో అత్యవసర భేటీ నిర్వహించనున్నట్టు సమాచారం.
