తెలంగాణ-చత్తీస్ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో 'ఆపరేషన్ కగర్'లో భాగంగా భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్‌లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా, ప్రభుత్వం మాత్రం ఏరివేత కొనసాగిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టుల నిర్మూలనకు కృతనిశ్చయంతో ఉన్నారు.
Operation Kagar : తెలంగాణ-చత్తీస్ ఘడ్ అడవుల్లో తుపాకుల మోత మోగుతోంది. మావోయిస్టుల ఏరివేతను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది... ఇటీవల కేంద్ర హోంమంత్రి మరో ఏడాదిలో దేశంలో అసలు మావోయిస్టులే లేకుండా చేస్తామని హెచ్చరించారు. అనుకున్నట్లుగానే ఈ ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా భద్రతా బలగాల కాల్పుల్లో భారీగా మావోయిస్టులు హతమయ్యారు.
తెలంగాణ సరిహద్దులోని చత్తీస్ ఘడ్ అడవుల్లో 'ఆపరేషన్ కగర్' భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇలా గత ఐదు రోజులుగు కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరివేత ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏకంగా 28 మంది మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో హతమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు మావోయిస్టులకు సంబంధించిన భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలకు స్వాధీనం చేసుకున్నారు.
ఏకంగా 8000 పైగా భద్రతా బలగాలతో ఈ ఆపరేషన్ కగర్ చేపట్టారు. అడవిని జల్లెడ పడుతున్న బలగాలను మావోయిస్టులు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ భారీ బలగాలను నిలువరించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ లో మావోయిస్టులు హతమవుతున్నారు.
శాంతి చర్చలకు మావోయిస్టుల డిమాండ్ :
తెలంగాణ-చత్తీస్ ఘడ్ శివారులోని కర్రెగుట్టలో భద్రతా బలగాలు చేపట్టిన దాడులను నిలిపివేయాలని మానవ హక్కుల సంఘాలతో పాటు మావోయిస్టులు కూడా కోరుతున్నారు. మావోయిస్ట్ బస్తర్ ఇంచార్జ్ రూపేష్ పేరిట ఓ లేఖ విడుదల చేసారు.... ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపరేషన్ కగార్ ఆపాలని డిమాండ్ చేసారు. శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని... చర్చల ద్వారా శాంతియుత వాతావరణంలో సమస్యను పరష్కరించుకుందామని కోరారు.
అయితే ప్రభుత్వం మాత్రం మావోయిస్టులను ఉపేక్షించే పరిస్థితే లేదంటోంది. కూంబింగ్ కొనసాగించి మావోయిస్టుల ఏరివేతకే మొగ్గు చూపుతోంది. దేశంలో మావోయిస్టుల సమస్య లేకుండా చేస్తామని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో తెలియజేస్తోంది.
