India Pakistan conflict: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయినప్పటికీ కవ్వింపు చర్యలతో భారత్ ను రెచ్చగొట్టింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో ఇప్పుడు పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. సింధూ జలాలపై భారత్ కు లేఖ రాసింది.
India Pakistan conflict: భారత్ వరుస దెబ్బలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో మొత్తానికి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై గట్టి చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 23న జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశంలో భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌ను సంప్రదించి, సింధూ జలాల ఒప్పందాన్ని పునఃపరిశీలించాలంటూ విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా, భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సింధూ జలాల విషయంలో మరోసారి ఆలోచన చేయాలనీ, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని వేడుకున్నారు.
భారత్, మే 7న "ఆపరేషన్ సింధూర్" పేరిట పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని తొమ్మిది ఉగ్రశిబిరాలపై వైమానిక దాడులు జరిపింది. నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య డ్రోన్ దాడులు, సైనిక ప్రతిఘటనలు కొనసాగాయి. పాక్ రెచ్చగొట్టే చర్యలతో భారత్ తన నిర్ణయాన్ని మార్చలేదు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మే 13న మాట్లాడుతూ.. “ఏప్రిల్ 23న CCS తీసుకున్న నిర్ణయం ప్రకారం, పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి పూర్తి స్థాయిలో విరమించకపోతే ఒప్పందాన్ని నిలిపివేస్తాం. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల, సాంకేతిక మార్పుల నేపథ్యంలో ఇది తగిన చర్య” అని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మే 12న చేసిన ప్రసంగంలో “రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు” అని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యను పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు.
1960లో సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం, భారతదేశానికి సింధు నదీ వ్యవస్థలోని మొత్తం నీటి కేవలం 30% మాత్రమే లభిస్తుంది. మిగిలిన 70% పాకిస్థాన్‌కు వెళ్తుంది. ప్రస్తుతం భారత్ తన వాటాను పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. అంతేకాకుండా, వరదలపై సమాచారం పంచుకునే ప్రక్రియను కూడా నిలిపివేసింది. ఈ పరిణామాలతో పాకిస్థాన్ తీవ్ర ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో కరవు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే భారత్ తన నిర్ణయంలో మార్పుకు అవకాశం లేదని స్పష్టం చేస్తోంది.
