India Pakistan Tensions: పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరణించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, పాకిస్తాన్ డ్రోన్లను భారత గగనతలంలోకి పంపడం ద్వారా దాన్ని ఉల్లంఘించింది, దీంతో అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.

India Pakistan Tensions: శనివారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జమ్మూలోని ఆర్ ఎస్ పూర ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. Xలో ఒక పోస్ట్‌లో బీఎస్ఎఫ్ ఈ విషయాన్ని వెల్లడించింది. మే 10, 2025న జమ్మూలోని ఆర్ఎస్ పూర ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ వీరమరణం పొందారని తెలిపింది. మే 11న పలౌరాలోని ఫ్రాంటియర్ హెడ్‌క్వార్టర్స్ జమ్మూలో పూర్తి గౌరవాలతో పుష్పాంజలి కార్యక్రమం జరుగుతుందని బీఎస్ఎఫ్ తెలిపింది.

ఇలావుండగా, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరిన తర్వాత పాక్ తన వక్రబుద్దిని చూపిస్తూ సరిహద్దులో కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దాడులు చేయడంతో శ్రీనగర్ సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది. అలాగే, పాక్ ఈ చర్యలను వెంటనే ఆపాలని భారత్ పేర్కొంది. పాక్ దాడులకు తిప్పికొట్టేందుకు మన సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. 

భారత వైమానిక రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ డ్రోన్‌లను అడ్డుకున్నాయి. ఈ సమయంలో శ్రీనగర్‌లో భారీ పేలుళ్లు వినిపించాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్, బార్మెర్‌లో పూర్తి బ్లాక్అవుట్ అమలు చేశారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనతో దాడుల‌కు తెగ‌బ‌డిన ప్రాంతాల్లో ఉధంపూర్, అఖ్నూర్, నౌషెరా, పూంచ్, రాజౌరి, మెంధర్, జమ్మూ, సుందర్‌బాని, RS పురా, అర్నియా, కతువా ఉన్నాయి.

అంతకుముందు, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తన భారతీయ డీజీఎంవోను శనివారం మధ్యాహ్నం సంప్రదించారని తెలిపారు. "పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) ఈరోజు మధ్యాహ్నం 15:35 గంటలకు భారతీయ డీజీఎంఓకు ఫోన్ చేశారు. భూమి, గాలి, సముద్రంలో అన్ని కాల్పులు, సైనిక చర్యలను భారత ప్రామాణిక సమయం ప్రకారం 17:00 గంటల నుండి నిలిపివేయాలని ఇరువురు అంగీకరించారు" అని ఆయన అన్నారు.

"శ‌నివారం ఈ అవగాహనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇరువైపులా ఆదేశాలు జారీ అయ్యాయి. డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న మధ్యాహ్నం 12:00 గంటలకు మళ్లీ మాట్లాడుకుంటారు" అని ఆయన తెలిపారు.

కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారతదేశం ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. భారత్ పాక్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. ఆ త‌ర్వాత పాకిస్తాన్ స‌రిహ‌ద్దులో కాల్పుల‌తో పాటు డ్రోన్ల‌తో భార‌త్ పై దాడుల‌కు తెగ‌బ‌డటంతో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం వ‌చ్చింది. తాజాగా కాల్పుల విర‌మ‌ణకు అంగీక‌రించిన మూడు గంట‌ల్లోనే పాక్ ఉల్లంఘించ‌డం గ‌మ‌నార్హం.