భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన తర్వాత, పరిస్థితి చక్కబడటంతో వాటిని తిరిగి తెరిచారు.

న్యూఢిల్లీ:

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలు మళ్లీ సాధారణ కార్యకలాపాలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. గతంలో మే 15 ఉదయం వరకు ఈ విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు కానీ తాజా నిర్ణయంతో ప్రయాణికులకు ఊరట కలిగింది. ఇప్పుడు అక్కడి నుంచి అన్ని పౌర విమానాలు మళ్లీ రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి.

ప్రత్యేకంగా చండీగఢ్ విమానాశ్రయం పూర్తిగా ప్రారంభమైందని అక్కడి స్థానిక అధికారులు ధృవీకరించారు. మొహాలీ డిప్యూటీ కమిషనర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీనికితోడు ప్రయాణికులు తమ విమానాల వివరాలను సంబంధిత విమానయాన సంస్థల వెబ్‌సైట్ల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ తాత్కాలిక మూసివేతకు ప్రధాన కారణం "ఆపరేషన్ సింధూర్" తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలే. మే 7న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ శత్రుత చూపుతూ షెల్లింగ్, డ్రోన్ దాడుల వంటి చర్యలు చేపట్టింది. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలోని కొన్ని ఎయిర్ ట్రాఫిక్ మార్గాలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే మే 11, 12 తేదీల్లో పరిస్థితి కొంతమేర శాంతించడంతో విమానాశ్రయాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

తాత్కాలికంగా మూసిన 32 విమానాశ్రయాల్లో ఆదంపూర్, అంబాలా, అమృత్‌సర్, చండీగఢ్, శ్రీనగర్, జైసల్మేర్, లేహ్, జమ్మూ, భుజ్, జోధ్‌పూర్, కాంగ్రా, షిమ్లా లాంటి ప్రాంతాలు ఉన్నాయి.ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉండటంతో, మళ్లీ సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందుగా వివరాలు తెలుసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.