అఫ్ఘానిస్థాన్‌కు చెందిన మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్, భారత్–పాక్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలపై స్పందించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఒక దృఢమైన వ్యూహాత్మక విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు.
భారత్ ఈసారి సంయుక్త జాతీయ భద్రతా మండలి (UNSC) ఆదేశాల కోసం వేచి చూడలేదు. పాత కాలపు UNSC ఆధిపత్యం మీద భారత్ ఆధారపడకుండా తన ధైర్యం, స్వయంప్రతిపత్తితో ముందడుగు వేసిందని సాలెహ్ చెప్పారు. ఇప్పటివరకు ఉగ్రవాదులు వేరుగా, వారిని మద్దతు ఇచ్చేవాళ్లు వేరుగా అనే తప్పుడు అభిప్రాయాన్ని భారత్ తొలగించిందని అన్నారు. ఈసారి భారత్.. పాక్ సైన్యంలో ఉన్న ఉగ్ర మద్దతుదారులను కూడా టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చారు.
పాక్ IMF నుంచి అప్పుగా డబ్బు తీసుకున్నప్పటికీ, ఆ డబ్బుతో యుద్ధం సాగించలేదని సాలెహ్ చెప్పారు. “పాక్ చిన్న చిన్న పోరాటాలు చేయగలదు, కానీ పూర్తి స్థాయి యుద్ధాన్ని నెట్టుకొచ్చే సామర్థ్యం లేదు” అని అన్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఏప్రిల్ 22న దాడి చేయడం ద్వారా భారత్ సంయమనం పరీక్షించారని, కానీ ఆ దాడి వాళ్లకే నష్టంగా మారిందన్నారు. "వాళ్లు 2008లో ఉన్నట్టు తమను తాము ఊహించుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు.
పాక్‌లో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ చాలా రక్షణ గలదని అనుకుంటే, ఈసారి భారత్ ఆ మిథ్యను చెదిపేసిందన్నారు. “రావల్పిండి లాంటి పాక్ సైనిక కేంద్రం కూడా భారత్ చేరగలిగే పరిధిలో ఉంది” అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో సమాచారం గోప్యంగా ఉంచడం చాలా కష్టం. అయినా భారత్ తన ఆపరేషన్ గురించి లీక్ కాకుండా నిష్శబ్దంగా నిర్వహించడం గొప్ప నైపుణ్యానికి నిదర్శనం అని ప్రశంసించారు.
పాక్ ప్రకటించిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ గురించి నిజమైన ఫోటోలు లేదా సమాచారం బయటపడలేదని, దాదాపు అది ప్రారంభమైందో లేదో కూడా తెలియలేదన్నారు. భారత దేశంలో విమాన సర్వీసులు నిలిపివేయకపోవడం, క్షిపణులు పడిన దృశ్యాలు లేకపోవడం వంటి వాటితో పాక్ దాడులు వాస్తవంగా జరగలేదనే అభిప్రాయం బలపడుతోందని అభిప్రాయపడ్డారు. నిజానికి అమ్రుల్లా ఈ వ్యాఖ్యలను రెండు రోజుల క్రితం చేయగా తాజాగా వైరల్ అవుతున్నాయి.
