మిస్ వ‌రల్డ్ 2025 ఈవెంట్స్ అధికారికంగా ప్రారంభమైన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్న సుందరీమ‌ణులు న‌గ‌రంలోని ప‌లు ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మంగ‌ళ‌వారం ప్ర‌పంచ సుందరీమ‌ణులు పాత బ‌స్తీలో సంద‌డి చేశారు.  

మిస్ వరల్డ్ 2025 ఈవెంట్స్‌లో భాగంగా మే 13న హైదరాబాద్‌ను సందర్శించిన అంతర్జాతీయ బ్యూటీ క్వీన్స్ పాతబస్తీలో జరిగిన ప్రత్యేక హెరిటేజ్ వాక్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హైదరాబాద్‌ నగరపు సంప్రదాయ సంస్కృతిని, రాజకీయ వారసత్వాన్ని ఆస్వాదించారు.

వారు నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్‌కు వచ్చారు. అక్కడ వారికి పాతబస్తీ సంబరాలకు ప్రత్యేకమైన మర్ఫా సంగీతంతో స్వాగతం పలికారు.

చార్మినార్ వద్ద ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించగా, ప్రపంచ దేశాల సుంద‌రీమ‌ణులు ఈ చారిత్రక కట్టడికి పక్కన ఫోజులిచ్చారు. అనంతరం వారు ప్రసిద్ధ లాడ్ బజార్ (చూడి బజార్)లోని తొమ్మిది ఎంపిక చేసిన షాపులు సందర్శించారు.

అనంత‌రం చౌమ‌హ‌ల్లా ప్యాలెస్‌ను కూడా సంద‌ర్శించారు. రాత్రికి చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు వీరు చుడీ బజార్‌లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేయనున్నారు. అంతే కాకూండా వీరికి మెహందీ పెట్టడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.