Hair Growth: రోజూ వీటిని తింటే చాలు.. జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
ప్రస్తుతం చాలామంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతిరోజు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. మరి జుట్టుకు బలం చేకూర్చే ఆ ఆహారాలేంటో.. వాటిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.

జుట్టు పెరుగుదలకు కరివేపాకు
కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు దెబ్బతినడం, తెల్లబడటం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం నాలుగు కరివేపాకులు నమిలి తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మునగాకు
మునగాకులో ఫోలేట్, ఐరన్, విటమిన్లు A, C వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మునగాకు చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గించి.. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. మునగాకును వండుకొని తినచ్చు. లేదా ఆకును ఎండబెట్టి పొడి చేసి ఆహారంలో కలుపుకొని తినచ్చు.
డ్రై ఫ్రూట్స్
బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, B, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు. ప్రతిరోజు ఉదయం 5 బాదం పప్పులు తినచ్చు.
వేరుశనగ
వేరుశనగలో ఉండే విటమిన్ E, జింక్, మెగ్నీషియం, బయోటిన్ వంటి పోషకాలు జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతాయి. వేరుశనగలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినడం మంచిది.
ఉసిరికాయ
ఉసిరికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, చుండ్రు వంటి సమస్యలను నివారించడంలో ఉసిరి సహాయపడుతుంది. అందుకోసం ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తినడం మంచిది.
మెంతులు
జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు మెంతులు చక్కటి పరిష్కారం. మెంతుల్లోని పైటో ఈస్ట్రోజెన్ గుణాలు దెబ్బతిన్న జుట్టును మెరుగుపరచడంలో సహాయపడుతాయి. జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అందుకోసం మెంతులను రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినచ్చు.