- Home
- Telangana
- Telangana Cabinet: బీసీలకు 42% రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Telangana Cabinet: బీసీలకు 42% రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Telangana Cabinet: తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు, వివిధ శాఖ పనితీరుపై చర్చించారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ ప్రభుత్వం పాలనలో మరో కీలక మైలురాయిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు ఈ సమావేశ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పులతో రాష్ట్రంలోని గ్రామీణ పాలన మరింత సమర్థవంతంగా మారనుంది. కొత్త చట్టంతో గ్రామ సభల ప్రాముఖ్యత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనిపై ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయనుందని సమాచారం. దీని కోసం ఇప్పటికే అసెంబ్లీని గవర్నర్ ప్రోరోగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ పై దృష్టి
సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ పై ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా రిజర్వేషన్ల అమలు కీలక అంశమవుతుంది.
వర్షాకాలంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం
వర్షాకాలం నేపథ్యంలో తగిన ముందస్తు చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. వరదల బీభత్సాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపైనా సమీక్ష చేపట్టారు.
18 సమావేశాల్లో 327 అంశాలపై చర్చ
ప్రస్తుతం వరుసగా 18 కేబినెట్ సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో 327 అంశాలు చర్చకు వచ్చి, 321 అంశాలకు ఆమోదం లభించిందని వివరించారు. మొత్తం 96 శాతం అంశాలు అమలులోకి వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 25న మరోసారి కేబినెట్ సమావేశం జరగనుందని తెలిపారు.